కరోనా మహమ్మారితో దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. ప్రత్యేక జాగ్రత్తల నడుమ విద్యాసంవత్సర తుది పరీక్షలు, పలు ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే లైఫ్ సైన్స్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీఈటీ) నిర్వహించింది మైసూర్ విశ్వవిద్యాలయం.
మానసగంగోత్రి సంస్కృతం విభాగంలో నిర్వహించిన ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షలో ఓ విద్యార్థిని ప్రత్యేక వ్యక్తిగత భద్రత కిట్టు ధరించి హాజరవటం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇటీవలే కరోనా పాజిటివ్‌గా తేలిన ఓ విద్యార్థిని.. పరీక్షకు హాజరుకావాలని సంకల్పించుకుంది. ప్రత్యేక వ్యక్తిగత భద్రత కిట్టు (పీపీఈ కిట్టు) ధరించి పరీక్షకు హాజరైంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు ఆమెకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మిగతా విద్యార్థులతో కాకుండా ప్రత్యేక గదితో పాటు ప్రత్యేకంగా ఒక ఇన్విజిలేటర్‌ను నియమించారు.
ఇదీ చూడండి: కేరళ గవర్నర్‌కు కరోనా పాజిటివ్