మహారాష్ట్రలో గవర్నర్‌కు, మహా వికాస్ అఘాఢీ ప్రభుత్వానికి మధ్య దూరం మరింత పెరుగుతోంది. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీకి, ప్రభుత్వ పెద్దలకు మధ్య విభేదాలు ఇప్పటికే చాలాసార్లు బయటపడ్డాయి. బహిరంగంగానే విమర్శలు చేసుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఆ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. తాజాగా ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కీలక పదవుల్లో ఉన్నవారు అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ పేరు ప్రస్తావించకుండా విమర్శలు చేశారు. ఆ సమయంలో ప్రధాని మోదీ సహా గవర్నర్ కోశ్యారీ సైతం అదే వేదికపై ఉండడం గమనార్హం.
పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రధాని మోదీ మహారాష్ట్రలోని పుణెలో ఆదివారం పర్యటించారు. ఈ క్రమంలో ఇక్కడి ఎంఐటీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో ప్రధాని, గవర్నర్, డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వేదికపై ఉండగా.. అజిత్ పవార్ మాట్లాడారు. "ప్రధాని మోదీ దృష్టికి ఓ విషయం తీసుకురావాలనుకుంటున్నా. కీలక పదవుల్లో ఉన్న కొందరు వ్యక్తులు ఈ మధ్య మహారాష్ట్రకు, ప్రజలకు ఆమోదంనీయం కాని, అవసరంలేని వ్యాఖ్యలు చేస్తున్నారు" అంటూ గవర్నర్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. శివాజీ, ఆయన తల్లి జిజియా భాయి స్వరాజ్యాన్ని స్థాపించారని, జ్యోతిభా పూలే, సావిత్రిభాయి పూలే వంటివారు స్త్రీ విద్యకు పునాది వేశారని గుర్తుచేశారు. అలాంటి వారి ఆదర్శాలను కొనసాగించాలే తప్ప.. వారిని రాజకీయాల్లో లాగకూడదని చెప్పారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్.. శివాజీ, చంద్రగుప్తుడు వంటి చక్రవర్తులను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో తల్లుల పాత్ర ఎంత కీలకమో.. గురువులు సైతం కీలక భూమిక పోషించారని చెప్పారు. ఈ సందర్భంగా చంద్రగుప్తుడి గురువు చాణక్యుడు, శివాజీ గురువు సమర్థ రామదాసు అంటూ కోశ్యారీ వ్యాఖ్యానించారు. అయితే, శివాజీ గురువుగా సమర్థ రామదాస్‌ను పేర్కొనడాన్ని శివసేన-ఎన్సీపీ- కాంగ్రెస్‌తో పాటు, భాజపా నేతలు సైతం తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌పై మోదీకి ఫిర్యాదు చేస్తూ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చూడండి: 'గిరిజనులపై రాకెట్ లాంచర్ల ప్రయోగం.. మహిళలపై జవాన్ల వేధింపులు'