VONTIMITTA KODANDARAMA SWAMY KALYANAM: ఒంటిమిట్టలో శ్రీ కోదండరాముడి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. చతుర్దశి రోజు పండు వెన్నెలలో నిండు చంద్రుడు కనులారా వీక్షించే విధంగా.. సీతారాముల కల్యాణం కన్నులపండువగా నిర్వహించారు. వేలమంది భక్తుల సమక్షంలో సాగిన కల్యాణ మహోత్సవానికి.. ప్రభుత్వం తరఫున దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
లక్ష మంది భక్తులు హాజరు: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలలో అత్యంత కీలక ఘట్టం సీతారాముల కల్యాణ మహోత్సవం బుధవారం రమణీయంగా సాగింది. పురాణాల ప్రకారం ఆరుబయట పున్నమి చంద్రుడు వీక్షించేలా పండువెన్నెలలో సీతారాముల కల్యాణం నిర్వహించాలనే ఆనవాయితీ ప్రకారం...శాశ్వత కళ్యాణ వేదికలో తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా కోదండరాముడి కల్యాణాన్ని జరిపించింది. దాదాపు లక్ష మంది భక్తుజనులు హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒంటిమిట్ట ఆలయం వరకు పట్టువస్త్రాలను తీసుకొచ్చి సమర్పించగా... అక్కడి నుంచి కల్యాణ వేదిక వద్దకు దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తలపైన పెట్టుకుని తీసుకెళ్లి స్వామివారికి అందజేశారు.
అంతకుముందు ఆలయం నుంచి ఉత్సవమూర్తులను అత్యంత కమనీయంగా అలంకరించి.. ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఎదుర్కోలు ఉత్సవం ఆడుకుంటూ శాశ్వత కళ్యాణ వేదిక వద్దకు శోభాయాత్ర నిర్వహించారు. రాత్రి 8 గంటలకు స్వామివారి కల్యాణ క్రతువులు వేద పండితులు, ఆగమ సలహాదారు రాజేష్ కుమార్ భట్టార్ ఆరంభించారు. రాత్రి 10 గంటల వరకు స్వామివారి కల్యాణ క్రతువును శాస్త్రోక్తంగా, వేద మంత్రోచ్ఛారణల మధ్య అత్యంత కన్నులపండువగా నిర్వహించారు. కచ్చితంగా రాత్రి 9 గంటల 15 నిమిషాలకు సీతారాముల కళ్యాణ గడియలో కీలక ఘట్టమైన జీలకర్ర - బెల్లం పెట్టే క్రతువు నిర్వహించారు. అనంతరం తొమ్మిదిన్నర గంటలకు మాంగళ్య ధారణ జరిగింది. సీతారాములు ఒకరిపై ఒకరు ముత్యాల తలంబ్రాలు పోసుకునే రమణీయ ఘట్టాన్ని వేద పండితులు అత్యంత అద్భుతంగా ఆవిష్కరించారు.
హాజరైన మంత్రులు: కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి హాజరుకానందున... ఆయన తరపున మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొట్టు సత్యనారాయణ, రోజా హాజరయ్యారు. కొందరు హైకోర్టు న్యాయమూర్తులూ కళ్యాణ క్రతువులో పాల్గొన్నారు. వేలాది మంది భక్తులకు గ్యాలరీలోనే స్వామివారి ముత్యాల తలంబ్రాలు, ప్రసాదం ప్యాకెట్లను అందజేశారు.
ఇవీ చదవండి: