కొవిడ్-19పై పోరులో అత్యంత కీలక ఆయుధాలు టీకాలే. వీటిని కొనుగోలు చేసే విషయంలో భారత్ జాప్యం చేసిందని ప్రముఖ వైరాలజిస్టు గగన్‌దీప్ కాంగ్ పేర్కొన్నారు. వ్యాక్సిన్లు ఇంకా ప్రయోగ దశలోనే ఉన్నాయన్న కారణంతో వాటిని కొనుగోలు చేసే రిస్కును భారత ప్రభుత్వం తీసుకోలేదని ఆమె పేర్కొన్నారు. అమెరికా వంటి దేశాల తరహాలో మొదటే వాటిని భారీ స్థాయిలో కొనుగోలు చేసి ఉంటే నేడు పరిస్థితి మెరుగ్గా ఉండేదని 'ఈటీవీ భారత్'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె పేర్కొన్నారు.
"టీకాలు ఇంకా అభివృద్ధి దశలో ఉండగానే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వాటిని పొందేందుకు ఆత్రుత ప్రదర్శించాయి. భారత్ కూడా గత ఏడాదే భారీ స్థాయిలో వాటి కొనుగోలుకు పూనుకొని ఉంటే దేశంలో నేడు వ్యాక్సినేషన్ పరిస్థితి చాలా మెరుగ్గా ఉండేది. మహమ్మారిని ఎదుర్కోవడం అంత సులువైన అంశమేమీ కాదు. టీకాలన్నీ ప్రయోగ దశలోనే ఉన్నాయన్న కారణంతో గత ఏడాదే వాటిని కొనుగోలు చేసే రిస్కును మన ప్రభుత్వం తీసుకోలేదు. టీకా ప్రయోగాలు చివరి దశకు చేరే వరకూ ఎదురుచూసింది. మిగతా దేశాల తరహాలో మొదటే వాటిని కొనుగోలు చేసి ఉండాల్సింది. ఆ టీకా పనిచేస్తుందా.. లేదా.. అన్నది అప్పటికి ప్రభుత్వానికి తెలిసి ఉండకపోవచ్చు. అయినా ఆ కార్యక్రమంపై పెట్టుబడి పెట్టి ఉండాల్సింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా మదింపు చేస్తూ.. ప్రణాళిక, పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకోవాల్సింది. మరిన్ని టీకా సంస్థలను సంప్రదించి ఉంటే ఫలితాలు మెరుగ్గా ఉండేవి" అని కాంగ్ చెప్పారు. భారత్‌లో టీకాలకు తీవ్ర కొరత ఏర్పడిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలివీ..
వాస్తవిక ధోరణితో ఆలోచించాల్సింది
"మన సొంత తయారీదారులపై మనం ఆధారపడ్డాం. ఇది మంచిదే. అయితే సరఫరా సమయం, వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం గురించి తయారీదారులు, ప్రభుత్వం వాస్తవిక ధోరణితో ఆలోచించి ఉండాల్సింది. ఇందులో చాలా అంశాలు అంచనాలకు అతీతంగా ఉంటాయి. టీకాలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో అప్పటికి తెలియదు. ఉత్పత్తి సామర్థ్యం పెంపులో ఇబ్బందుల గురించి తెలియదు. అయితే ఎప్పటికప్పుడు వెలువడే డేటా ఆధారంగా మన టీకా కార్యక్రమం, సరఫరా పరిస్థితిపై ఒక అంచనాకు రావడం మాత్రం సాధ్యమే. అలా చేసి ఉంటే పరిస్థితి చాలా మెరుగ్గా ఉండేది" అని కాంగ్ పేర్కొన్నారు. టీకాల ఉత్పత్తికి మరో 2-3 తయారీదారులను ప్రభుత్వం రంగంలోకి దించి ఉండాల్సిందన్నారు.
డబ్ల్యూహెచ్‌వో సూచన పాటించి ఉంటే..
వ్యాక్సిన్లకు ప్రభుత్వపరంగా ఆమోదముద్ర విషయంలో వివిధ దేశాల నియంత్రణ వ్యవస్థలు కూటమిలా వ్యవహరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచించిందని కాంగ్ గుర్తుచేశారు. "ఈ సూచనను భారత్ మొదటే పాటించి ఉంటే మనకు మరిన్ని టీకాలు లభ్యమై ఉండేవి. ఫైజర్, మోడెర్నాల సంస్థలకు దాన్ని వర్తింపచేసి ఉంటే మనకు మరో రెండు రకాలు టీకాలు అందుబాటులో ఉండేవి" అని ఆమె వ్యాఖ్యానించారు.
డిసెంబరు నాటికి 200 కోట్ల డోసులు అసాధ్యమే
భారత్‌లో కొవిడ్ టీకాలను ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్, సీరం ఇన్‌స్టిట్యూట్‌లు అద్భుతమైన సంస్థలేనని కాంగ్ చెప్పారు. "టీకాల ఉత్పత్తి సామర్థ్యం వాటికి ఉంది. అయితే సామర్థ్య పెంపు ఇక్కడ ప్రధాన సమస్య" అని తెలిపారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి 200 కోట్ల డోసులను సమకూర్చుకుంటామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. "డిసెంబరు నాటికి అన్ని డోసులను సేకరించడం సాధ్యం కాకపోవచ్చు. అయితే అది సాకారం కావాలని ఆకాంక్షిస్తున్నా. టీకాల విషయంలో మన పరిస్థితిలో ఏ మాత్రం మార్పు లేదు’’ అని చెప్పారు. ధనిక దేశాలన్నీ తమ ప్రజలకు టీకాలు వేసే వరకూ భారత్ వేచి చూడాల్సిందేనని కాంగ్ అన్నారు. "తమ ప్రజల కోసం ధనిక దేశాలు టీకాలను నిల్వ చేసుకున్నాయి. వీటిలోని అనేక దేశాల్లో జనాభా చాలా తక్కువ. అందువల్ల అక్కడ వ్యాక్సినేషన్ పూర్తయితే మనకు టీకాలు అందుబాటులోకి వస్తాయి. ఈ ఏడాది చివరి నాటికి మన దేశంలో సరఫరా పరిస్థితి మెరుగుపడుతుందన్నది నా అంచనా" అని ఆమె తెలిపారు.
ఇదీ చదవండి: 20 రోజులుగా స్థిరంగా తగ్గుతున్న కరోనా