Villupuram Minor girl gang rape: దగ్గరి బంధువే కీచకుడిగా మారి, స్నేహితులతో కలిసి ఓ బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన తమిళనాడు విల్లుపురంలో జరిగింది. బాధితురాలు చదువుతున్న పాఠశాల ఉపాధ్యాయురాలి కారణంగా ఈ అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి, మరో ఏడుగురి కోసం గాలిస్తున్నారు.
టీచర్‌కు అనుమానం వచ్చి...: 15 ఏళ్ల బాలిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అయితే.. కొద్దిరోజులుగా ఆమె తరగతి గదిలో చురుకుగా ఉండడం లేదు. చాలా నీరసంగా, నైరాశ్యంతో కనిపిస్తోంది. ఆమె క్లాస్ టీచర్‌కు అనుమానం వచ్చింది. బాలికను పక్కకు పిలిచి ఆరా తీశారామె. అసలు విషయం తెలుసుకుని కంగుతిన్నారు. వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి, విద్యాశాఖ జిల్లా అధికారికి సమాచారం ఇచ్చారు. విల్లుపురం మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముడియంబాకంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు.
విచారణలో బాలిక చెప్పినదాని ప్రకారం.. ఆమె బావ(మేనమామ కుమారుడు) శశి ప్రధాన నిందితుడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతడు బాలికను లైంగికంగా వేధించేవాడు. 9 మంది స్నేహితులను తీసుకొచ్చి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ వివరాల ఆధారంగా పోలీసులు కార్యాచరణ చేపట్టారు. బాధితురాలి బావ శశి, అతడి స్నేహితులు మణికందన్, వినాయక మూర్తిని అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద వారిపై కేసు నమోదు చేశారు. మిగిలిన ఏడుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు.
బాలికపై అత్యాచారం.. చట్టవిరుద్ధంగా అబార్షన్: మధ్యప్రదేశ్ బేతుల్ జిల్లాలో అత్యాచారానికి గురై, గర్భం దాల్చిన 15ఏళ్ల బాలికకు చట్టవిరుద్ధంగా అబార్షన్ చేయించిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. బాలికను కోచింగ్ సెంటర్ ట్యూటర్(26) గతేడాది అక్టోబర్ 16న రేప్ చేశాడు. ఆమె గర్భం దాల్చగా.. తల్లిదండ్రులు మార్చి 22న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అబార్షన్ చేయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. అబార్షన్ చేసిన డాక్టర్‌ను, ట్యూటర్‌ను, బాలిక తల్లిదండ్రుల్ని అరెస్టు చేశారు. ఐపీసీ, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
రేప్ చేశాడనుకుని టీచర్‌పై దాడి: మరోవైపు.. ఆరో తరగతి విద్యార్థిని లైంగికంగా వేధించాడన్న అనుమానంతో మహారాష్ట్ర భూదర్గఢ్ మండలంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిపై దాడి జరిగింది. టీచర్‌ను ఓ గదిలో బంధించిన గ్రామస్థులు అతడ్ని చితకబాదారు. అయితే.. అతడు ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని, బాలిక తల్లిదండ్రులు తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే ఇలా జరిగిందని చివరకు తేల్చారు. పరస్పరం కేసులు పెట్టుకోరాదని ఒప్పందానికి వచ్చారు. టీచర్‌పై దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.