ఎన్నో ఏళ్లుగా వంతెన నిర్మించండంటూ అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగారు. చివరకు విసిగిపోయిన గ్రామస్థులు తామే సొంతంగా ఓ వంతెనను నిర్మించుకున్నారు. ప్రభుత్వ సాయం అడగకుండా తమ సొంత డబ్బులతో చందాలు వేసుకుని మరీ ఈ బ్రిడ్జిని నిర్మించుకున్నారు. ఇంత వరకు బాగానే ఉంది.. కానీ ప్రభుత్వ పనితీరును ప్రపంచానికి తెలిసేలా ఏదైనా చేయాలనుకున్నారు. అందుకే వింతగా ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ పేరును ఈ వంతెనకు పెట్టారు బిహార్లోని కిరాత్పుర్ గ్రామస్థులు.
కోసి నదిపై వంతెన లేకపోవడం వల్ల కిరాత్పుర్ గ్రామస్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్ని సార్లు చెప్పినా ప్రభుత్వం తమ గోడును వినడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి గ్రామస్థులందరూ కలిసి తమ సొంత డబ్బులతో రూ. 6 లక్షల విరాళాలు వేసుకున్నారు. 2000 వెదురు కర్రలతో 250 అడుగుల పొడవైన వంతెనను నిర్మించారు. ఈ వంతెనకు ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ పేరు మీద 'అంబానీ సేతు' అని పేరు పెట్టారు. అంతకుముందు చచరీ వంతెనగా పిలుస్తుండగా.. ఇలా అంబానీ పేరు పెట్టడం వల్లైనా ప్రభుత్వం దృష్టి తమ గ్రామంపై పడుతుందనే ఇలా చేశామని గ్రామస్థులు వాపోయారు. ఈ వంతెన కేవలం నడకకు మాత్రమే పనిచేస్తోందని చెప్పారు. ఏదైనా వాహనాన్ని వంతెనపై నడిపితే రూ. 500 జరిమానా విధిస్తామని తెలిపారు.
"కోసి నది మీదుగా వెళ్లాలంటే పడవ తప్ప మరో మార్గం లేదు. రాత్రి పూట ఆ సదుపాయం కూడా ఉండదు. ఈ వంతెన నిర్మాణం వల్ల కోసి కరకట్ట వెలుపల ఉన్న వేలాది మంది ప్రజలు ప్రయోజనం పొందుతారు. ఇంతకుముందు ఎవరైనా అనారోగ్యం పాలైతే ఆస్పత్రికి తీసుకెళ్లడం చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు వంతెన ప్రారంభంతో ఎంతో ఉపయోగంగా ఉంది"
- గ్రామస్థుడు
వంతెన నిర్మించుకున్నా ఆ గ్రామస్థుల కష్టాలు తీరలేదు. ఎందుకంటే కోసి నది నీటి మట్టం పెరిగితే ఈ వంతెన మునిగిపోతుంది. ఇకనైనా ప్రభుత్వం దృష్టి సారించి తమ గ్రామానికి వంతెన నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు. "కోసి నదికి అవతలి వైపు మాకు పొలాలు ఉన్నాయి. అక్కడికి వెళ్లాలి అంటే కష్టంగా ఉండేది. ప్రస్తుతం వంతెన వల్ల ఎక్కడికైనా ప్రయాణించడం సులువుగా మారింది. మా గ్రామం నాలుగు జిల్లాలతో అనుసంధానించి ఉంది. ఈ వంతెన ఎక్కువ కాలం ఉండదు. ఎందుకంటే కోసినది నీటి మట్టం పెరిగితే వంతెన నీటిలో మునిగిపోతుంది. కానీ కొన్ని నెలల కోసం ఈ వంతెనను నిర్మించాము." అని ఓ గ్రామస్థుడు తెలిపాడు.
ఇవీ చదవండి:
5000 మేకులతో 5 రోజులు శ్రమించి మోదీ నిలువెత్తు చిత్రపటం తయారు చేసిన షఫీక్
హిమాచల్ ప్రదేశ్ క్యాబినెట్ విస్తరణ.. మంత్రులుగా ప్రమాణం చేసిన ఏడుగురు MLAలు..