వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రభుత్వాలు మరింత విస్తృతం చేసేందుకు ప్రయత్నిస్తున్నా.. అవగాహన లేమి, అపోహల కారణంగా పలు చోట్ల ప్రజలు టీకా తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. కర్ణాటకలోని హుబ్బళ్లిలోని శరేవడా గ్రామంలో కూడా ఇటువంటి పరిస్థితే నెలకొంది. ఇందుకు ఆ గ్రామ సర్పంచ్ ఓ పరిష్కారాన్ని కనుగొన్నారు. టీకా తీసుకుంటేనే కానీ రేషన్ అందించేది లేదని స్పష్టం చేశారు.
రసీదు చూపిస్తేనే రేషన్..
టీకా తీసుకున్నట్లు ఆశ వర్కర్లు అందించిన రసీదును రేషన్ షాపులో చూపిస్తేనే గ్రామస్థులు రేషన్ తీసుకునేందుకు అర్హులని సర్పంచ్ ప్రకటించారు. దీంతో ప్రజలు టీకా కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. అయితే ప్రస్తుతం ఆ గ్రామంలో వ్యాక్సిన్లకు కొరత ఏర్పడింది. దీనిపై గ్రామస్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమకు వ్యాక్సిన్ ఇప్పించాలని.. లేదంటే రేషన్ అయినా అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి : మరింత పవర్ఫుల్గా కరోనా టీకా!