షాపులో సంస్కృత పాఠాలు.. అధ్యాపకుడిగా మారిన వస్త్ర వ్యాపారి.. - కర్ణాటక వస్త్ర వ్యాపారి
సంస్కృతం అంతరించిపోతున్న భాష. దానిపై ఉన్న మక్కువతో ఆయన నేర్చుకోవడమే కాకుండా కొన్ని వేల మందికి నేర్పించారు ఓ వ్యాపారి. షాపులో సైతం సంస్కృతంలోనే మాట్లాడుతూ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. తనతో పాటు తన కుటుంబం సైతం ఈ భాషపై మక్కువ చూపిస్తోంది. ఇంతకి ఈయన ఎక్కడ ఉన్నారో తెలుసుకుందామా...
భాషపై మక్కువ ఉంటే ఏ రంగంలో ఉన్న నేర్చుకోగలమని నిరూపించారో వస్త్ర వ్యాపారి. ఆ భాషపైనున్న అభిమానంతో ఆయన నేర్చుకోవడమే కాకుండా కొన్ని వేల మందికి నేర్పించారు. తనతో పాటు తన కుటుంబం సైతం భాషపై మక్కువ చూపిస్తోందంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. ఇంతకి వీరు ఇంతగా ఇష్టపడే భాష ఏదో తెలుసా.. మన ప్రాచీణ భాష సంస్కృతం.
కర్ణాటక విజయపురలోని మీనాక్షి చౌకలో ఓ వస్త్ర దుకాణం నడుపుతున్నాడు రామ్‌సింగ్ అనే వ్యక్తి. మాతృభాషే గొప్పది అని భావిస్తున్న ఈ సమాజంలో తోటి వారికి సంస్కృతం నేర్పించాలన్న ఆశయంతో ఓ కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. షాపులో పనిచేసే వర్కర్లకు ఆ భాషను నేర్పించారు. దీంతో వారు షాపుకి వచ్చే కస్టమర్లతో సంస్కృతంలోనే మాట్లాడుతారు.
రామ్‌సింగ్ రాజస్థాన్ చెందినవారే అయినప్పటికి, బట్టల వ్యాపారం చేస్తూ రెండు మూడు తరాల క్రితం విజయపురానికి వచ్చి స్థిరపడ్డారు. కొన్నేళ్లుగా చిన్నగా సాగుతున్న ఈ వ్యాపారం ఇప్పుడు అభివృద్ధి చెందింది. దాదాపు 70 మందికి పైగా కార్మికులు ఇప్పుడు ఆయన దుకాణంలో పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది ముస్లిం యువకులు, మహిళలే.
సంస్కృతంపై మక్కువ ఎలా ఏర్పడింది: 18 ఏళ్ల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి జ్ఞాన యోగాశ్రమం, సిద్ధేశ్వర మఠానికి వెళ్లారు. అక్కడ విన్న సంస్కృత ఉపన్యాసం ఆయన్ని ఎంతగానో ఆకట్టుకుంది. భగవంతునికి నమస్కరించి తిరిగి వెళ్ళేటప్పుడు తన ఉపన్యాసం వినమని అక్కడున్న వ్యక్తి సలహా ఇచ్చారు. అప్పుడు రామ్‌సింగ్‌కు సంస్కృత విశిష్టత అర్థమయ్యింది. అప్పటినుంచి ఆ ఇంటి వారంతా సంస్కృత భాష వైపు మళ్లారు.
భాషపైన మక్కువతో ఓ కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి దాని ద్వారా సుమారు 15 వేల మందికి శిక్షణ ఇచ్చారు. తన షాపులోకి కొత్తగా వచ్చిన పనివాళ్లకు పది రోజుల పాటు ఉచిత శిక్షణ అందిస్తారు. అలా నేర్పించడం వల్ల వారు కస్టమర్లతో సంస్కృతంలో మాట్లాడి వారికి కూడా నేర్పించే అవకాశం కలుగుతుందని రామ్‌సింగ్ అభిప్రాయం. 'సంస్కృత భారత్' అనే సంస్థను స్థాపించి భాష నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి పది రోజుల పాటు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.
అందులో భాగంగా మహారాష్ట్ర సరిహద్దులోని బాబాలాడ అనే గ్రామంలోని యువతకు సంస్కృతం నేర్పించారు. అంతేగాక జర్మనీ, అమెరికా, సింగపూర్ తదితర దేశాల్లోని భారతీయులు సైతం సంస్కృతం నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. విదేశాల్లోనూ సంస్కృతం బోధించాలని రామ్సింగ్ను భారతీయులు కోరగా .. ఇతర దేశాల సమయాలు తమకు అనుకూలంగా లేనందున ఈ విషయం గురించి ఆలోచిస్తున్నామని మ్‌సింగ్ కుమారుడు రాహుల్ సింగ్ తెలిపారు.
ఇదీ చదవండి: ఐదో తరగతి ఫెయిల్.. హెలికాప్టర్ తయారుచేసి అందలానికి..!