కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.. ఆ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) అధ్యక్షుడు కె.సుధాకరన్ మధ్య వాగ్వాదం ముదురుతోంది. కొన్నేళ్ల క్రితం సుధాకరన్ తన పిల్లలను కిడ్నాప్ చేయాలని యత్నించారని పినరయి విజయన్ శుక్రవారం ఆరోపించారు.
"చాలా సంవత్సరాల క్రితం ఓ రోజు ఉదయం సుధాకరన్‌కు స్నేహితుడైన ఓ వ్యక్తి మా ఇంటికి వచ్చాడు. పాఠశాలల్లో చదువుకునే నా పిల్లలను కిడ్నాప్ చేయాలని తనకు సుధాకరన్ చెప్పారని అతను నాతో అన్నాడు. నేను ఆ వ్యక్తి పేరును ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. ఇప్పటివరకు ఈ విషయాన్ని నా భార్య సహా ఎవరితోనూ చెప్పలేదు. ఇలాంటివి వింటే ఆమె భయపడిపోతుంది... అందుకే చెప్పలేదు."
- పినరయి విజయన్, కేరళ ముఖ్యమంత్రి
అయితే, దీనిపై స్పందించిన సుధాకరన్.. ఈ ఆరోపణలను నిరూపించాలని విజయన్‌కు సవాలు విసిరారు. ఇందులో నిజం ఉంటే అప్పుడే పోలీసులను ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం కొచ్చిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
"నా స్నేహితుడు ఒకరు తన వద్దకు వచ్చి, ఆయన పిల్లలను కిడ్నాప్ చేయాలని చెప్పారని ముఖ్యమంత్రి చెబుతున్నారు. కానీ, ఆ వచ్చిన వ్యక్తి ఎవరో, అతని పేరు ఏమిటో ఎందుకు చెప్పటం లేదు. సీఎం పదవిలో ఉన్న ఓ వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేయటం ఎంత మాత్రం తగదు."
- సుధాకరన్, కేపీసీసీ అధ్యక్షుడు
అయితే.. విజయన్‌కు చెందిన కొన్ని మీడియా సంస్థలు తనను గూండాలా చిత్రీకరించాలని యత్నిస్తున్నాయని సుధాకరన్ ఆరోపించారు. అందుకే తాను ఆఫ్ ద రికార్డు మాట్లాడినవి కూడా ప్రచురిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇలాంటి వాటి వల్ల ఏమీ కాదని.. ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు అన్నీ తెలుసని వ్యాఖ్యానించారు.
అసలెక్కడ మొదలైందంటే...
కన్నూర్ రాజకీయ ప్రత్యర్థులైన ముఖ్యమంత్రి విజయన్‌కు, కె.సుధాకరన్ మధ్య వాగ్వాదం.. ఓ మీడియాకు సుధాకరన్ ఇచ్చిన ఇంటర్యూతో ప్రారంభమైంది. తాను తాలస్సెరీ బ్రెన్నెన్ కళాశాలలో చదువుతున్నప్పుడు విజయన్ను కొట్టానని సుధాకరన్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.
దీనిపై శుక్రవారం స్పందించిన ముఖ్యమంత్రి విజయన్... అది సుధాకరన్ ఊహేనని కొట్టిపారేశారు. కేరళ స్టూడెంట్ యూనియన్, కేరళ స్టూడెంట్ ఫెడరేషన్‌కు మధ్య జరిగిన ఘర్షణల్లో... సుధాకరన్ను కేఎస్‌ఎఫ్ విద్యార్థులు అర్ధనగ్నంగా నడిపించారని ఆయన ఆరోపించారు. "నిజానికి ఇలాంటివి చెప్పాలని నాకు ఎంత మాత్రం అనిపించదు. కానీ, ఎవరైనా తప్పుడు విషయాలు మాట్లాడితే.. ఇలాంటి నిజాలను బయటపెట్టక తప్పదు" అని విజయన్ అన్నారు.
ఇదీ చూడండి: వ్యాక్సినేషన్‌పై కేరళ ప్రభుత్వానికి పీటీ ఉష విన్నపం
ఇదీ చూడండి: Kerala Gold Smuggling: కీలక నిందితుడు అరెస్ట్