ETV Bharat / bharat

'దక్షిణాది జలియన్‌వాలా బాగ్‌'.. ప్రజలపై 90 రౌండ్ల కాల్పులు.. 32మంది మృతి

author img

By

Published : Jun 30, 2022, 7:29 AM IST

Updated : Jun 30, 2022, 8:06 AM IST

Jalian wala bhag of south india: దేశం నలుదిక్కులూ స్వరాజ్‌ ఇండియా నినాదంతో దద్దరిల్లుతున్నాయి. ధ్వజ సత్యాగ్రహం దీక్ష చేపట్టిన ప్రజలంతా త్రివర్ణ పతాకాలు ఎగరేస్తున్నారు. అలాంటి సమయంలో.. ఆంధ్ర, కర్ణాటకల సరిహద్దులో చిక్‌బళ్లాపూర్‌ జిల్లాలోని విదురాశ్వత్థ గ్రామం ఆంగ్లేయ పోలీసుల కారణంగా రక్తమోడింది. 'దక్షిణ భారత జలియన్‌వాలా బాగ్‌'గా ప్రసిద్ధికెక్కింది. గాంధీజీని కంటతడి పెట్టించింది.

జలియన్​వాలా బాగ్​
జలియన్​వాలా బాగ్​

Vidurashwatha massacre: విదురాశ్వత్థ గ్రామం.. అప్పటి మైసూరు రాష్ట్రంలోని ఉమ్మడి కోలార్‌ జిల్లాలో ఉండేది. స్వాతంత్య్ర పోరాటం ఉద్ధృతంగా సాగుతున్న సమయంలో ప్రజల్లో స్ఫూర్తి నింపడానికి 1938లో మైసూరు సమీపంలోని శివపురలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి కాంగ్రెస్‌ నాయకులు ప్రయత్నించారు. పోలీసులు ముఖ్య నాయకులందరినీ అరెస్టు చేశారు. దీనికి నిరసనగా మైసూరు రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్‌ 22, 24 తేదీల్లో అహింసాయుత విధానంలో జెండావిష్కరణలు చేపట్టాలని కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది. స్థానిక ఉద్యమకారులు విదురాశ్వత్థలోనూ పతాకాన్ని ఎగురవేయాలని నిర్ణయించారు. అయితే.. పోలీసులు విరుచుకుపడతారని ముందే గ్రహించి, 25న కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నారు. అదే సమయంలో విదురాశ్వత్థలోని నారాయణ ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. గ్రామానికి ఒకవైపు దక్షిణ పినాకిని నది ప్రవహిస్తుంది. నదికి అటువైపు నిజాం సంస్థానం ఉంటుంది. ఒకవేళ పోలీసులు లాఠీఛార్జి చేస్తే నదిని దాటి నిజాం భూభాగంలోకి వెళ్లాలని ఉద్యమ నాయకులు ప్రణాళిక వేసుకొన్నారు. అనుకున్న ప్రకారమే ఏప్రిల్‌ 25 చుట్టుపక్కల గ్రామాల నుంచి వేల మంది ప్రజలు విదురాశ్వత్థకు తరలివచ్చారు. ఆలయం సమీపంలోని బహిరంగ ప్రదేశంలో జెండా ఆవిష్కరించడానికి ఏర్పాట్లు చేస్తుండగా పోలీసు బలగాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. ఎలాంటి హెచ్చరికలు చేయకుండానే... ప్రజలపై విచక్షణా రహితంగా దాదాపు 90 రౌండ్ల కాల్పులు జరిపాయి. తొక్కిసలాట కారణంగా తప్పించుకోవడానికి అవకాశం దక్కక సంఘటన స్థలంలోనే ఏకంగా 32 మంది అమరులయ్యారు. వంద మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటనతో దేశం ఉలిక్కిపడింది. ఇక్కడి మృత్యుకాండను దక్షిణ భారత జలియన్‌వాలా బాగ్‌గా వర్ణిస్తూ మైసూరు రాష్ట్రమంతా అట్టుడికింది.

ప్రభుత్వం తప్పుడు ప్రకటన
పోలీసుల దాష్టీకానికి నిరసనగా అదే నెల 29న గాంధీజీ... 'అహింసాయుతంగా ఉద్యమం చేస్తూ ప్రాణాలను పొగొట్టుకొన్న 32 మంది అమరుల త్యాగాలు వృథా కావు' అని ప్రకటన విడుదల చేశారు. మరోవైపు కేవలం పది మంది మాత్రమే మృతి చెందినట్లు బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రకటించింది. కాల్పులకు ఒడిగట్టిన పోలీసులకు క్లీన్‌చిట్‌ ఇవ్వడంతో మైసూరు ప్రాంతంలో పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. గాంధీజీ తమ పార్టీ తరఫున... పరిస్థితిని సమీక్షించి, నిజ నిర్ధారణ చేయడానికి వల్లభ్‌భాయ్‌పటేల్‌, ఆచార్య జె.బి.కృపలానీలతో కూడిన కమిటీని సంఘటనా స్థలానికి పంపించారు. విదురశ్వత్థకు చుట్టుపక్కలున్న అన్ని గ్రామాలను కాలినడకన సందర్శించి, ప్రజలతో మాట్లాడి, వివరాలను సేకరించిన పటేల్‌ బృందం... పోలీసుల కాల్పుల్లో 32 మంది మృతి చెందినట్లు నిర్ధారించింది.

తొలిసారిగా పాలనలో ప్రజలకు భాగస్వామ్యం
శాంతియుతంగా కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రజలపై ఏకపక్షంగా కాల్పులు జరపడం గర్హనీయమని, వెంటనే రాష్ట్ర పరిపాలనా విభాగంలో మార్పులు చేయాలని మైసూరు ప్రభుత్వానికి పటేల్‌ స్పష్టం చేశారు. కాల్పుల రూపంలో జరిగిన తప్పిదాన్ని గుర్తించిన మైసూరు పాలకుడు మీర్జా ఇస్మాయిల్‌ పాలనలో సంస్కరణలకు ముందుకు వచ్చారు. ఏడుగురు కాంగ్రెస్‌ ముఖ్య నాయకులతో సంస్కరణల కమిటీ ఏర్పాటైంది. వారి నివేదిక మేరకు... 1938 మేలో మీర్జా-పటేల్‌ ఒప్పందం కుదిరింది. ప్రభుత్వ పరిపాలన విభాగంలో దేశంలోనే తొలిసారిగా సాధారణ పౌరులకు సైతం భాగస్వామ్యం కల్పించారు. మైసూరు రాష్ట్రవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేయడంపై ఆంక్షలు ఎత్తివేశారు.

ఇదీ చూడండి : ఆంగ్లేయులను తరిమికొట్టిన గోండు వీరుడు.. ఆదివాసీలే సైన్యంగా

Last Updated : Jun 30, 2022, 8:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.