బెంగాల్ విభజనతో (bengal division 1905) యావత్ దేశం అట్టుడుకుతున్న దశ అది. రోజూ ఉద్యమాలతో బెంగాల్ అంతటా ఉద్రిక్తత! అలాంటి పరిస్థితుల్లో.. 1911 జులై 29న మాత్రం బెంగాల్‌లో ఎవరూ రాజకీయాల గురించి మాట్లాడలేదు. అంతా కోల్‌కతా మైదానం వైపు నడిచారు. అక్కడేదో భారీ రాజకీయ సమావేశం ఉందని కాదు. జాతీయ నేతలు వస్తున్నారనీ కాదు. ఫుట్‌బాల్ మ్యాచ్ చూడటానికి. ఈస్ట్ యార్క్‌షైర్ రెజిమెంట్ (ఆంగ్లేయ సైనికుల) జట్టుతో మోహన్‌బగాన్ ఆడుతున్న (mohun bagan team of 1911) ప్రతిష్ఠాత్మక ఐఎఫ్‌ఏ షీల్డ్ ఫైనల్
మ్యాచ్‌ను తిలకించటానికి!
తొలినాళ్లలో ఆంగ్లేయుల రాజధానిగా కొనసాగిన కోల్‌కతా, చుట్టుపక్కల ప్రాంతాలపై క్రికెట్, సాకర్‌ల ప్రభావం తీవ్రంగా ఉండేది. భారతీయులు కూడా తొందరగానే వీటిని అందుకున్నారు. బెంగాలీ యువతలో క్రీడా సంస్కృతిని పెంచే ఉద్దేశంతో 1889లో ఏర్పడింది మోహన్‌బగాన్ ఫుట్‌బాల్ క్లబ్. ఉత్తర కోల్‌కతాలోని కీర్తిమిత్రాకు చెందిన మోహన్‌బగాన్ బంగ్లాలో .. అప్పటి బెంగాల్ ప్రముఖుల సమక్షంలో ఆరంభమైందిది. అందుకే దానికి మోహన్ బగాన్ అని నామకరణం చేశారు. అచిరకాలంలోనే ఇది పుంజుకుంది. భారతీయ క్లబ్‌లు ఆడే కూచ్ బిహార్ ట్రోఫీని 1907కల్లా మూడుసార్లు గెల్చుకుంది. దీంతో 1911లో ప్రతిష్ఠాత్మక ఐఎఫ్‌ఏ షీల్డ్ టోర్నమెంటులో (mohun bagan team vs british team in 1911) ఆడేందుకు మోహన్ బగాన్‌కు ఆహ్వానం అందింది.
అసలే రాజకీయ వాతావరణం వేడెక్కి ఉన్న దశలో బ్రిటిష్ జట్టుతో బెంగాల్ జట్టు ఫైనల్ మ్యాచ్ ఆడటాన్ని అంతా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. జాతీయోద్యమానికి ముడిపెట్టి చూశారు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే తెల్లవారిపై పోరాటంలో నైతికబలం చేకూరుతుందనుకున్నారు. అందుకే మ్యాచ్ చూసేందుకు కోల్‌కతానే కాదు పట్నా, ఇప్పటి బంగ్లాదేశ్ నుంచి కూడా అభిమానులు పోటెత్తారు. తూర్పురైల్వే ప్రత్యేకంగా రైళ్లు నడిపింది. దాదాపు లక్ష మంది ప్రేక్షకులు హాజరయ్యారు. మైదానం నిండగా, చుట్టూ ఉన్న గోడలు, గుంజలు, చెట్లు, చుట్టుపక్కల డాబాలు ఇలా ఎక్కడ వీలైతే అక్కడ కూర్చొని మ్యాచ్ చూశారు.
తెల్లబోయిన తెల్లవారి శిబిరం..
బ్రిటిష్ జట్టు బూట్లతో రంగంలోకి దిగింది. మరోవైపు మోహన్‌బగాన్ జట్టు బూట్లు లేకుండా, వట్టికాళ్లతో మైదానంలో అడుగుపెట్టింది. శిబదాస్ బదూరి సారథ్యంలోని బగాన్ దూకుడుగానే ఆరంభించినా ప్రథమార్ధంలో స్కోర్ చేయలేకపోయింది. ద్వితీయార్ధం 15వ నిమిషంలో యార్క్‌షైర్ కెప్టెన్ సార్జెంట్ జాక్సన్ తొలి గోల్ చేసి తమ జట్టును 1-0తో ఆధిక్యంలో నిలిపాడు. యావత్ స్టేడియంలో మౌనం! మనసుల్లో కల్లోలం. కానీ ఐదు నిమిషాల్లోనే శిబదాస్ స్కోర్‌ను సమం చేశాడు. అక్కడి నుంచి ఆధిక్యం కోసం పోరు హోరాహోరీగా సాగింది. మోహన్‌బగాన్ ఆటగాళ్లు బూట్లు లేకుండా ఆడుతూ పటిష్ఠమైన ఆంగ్లేయ జట్టును స్కోర్ చేయకుండా నిలువరించటం అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. యావత్ స్టేడియం ఈలలతో, నినాదాలతో వారికి మద్దతిస్తుంటే మరో రెండు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా శిబుదాస్ అందించిన పాస్‌ను అభిలాష్‌ఘోష్ గోల్‌గా మలచటంతో తెల్లవారి శిబిరం తెల్లబోయింది. స్టేడియమంతా ఉవ్వెత్తున ఎగిసింది. బగాన్ సభ్యులంతా చొక్కాలు చింపుకొని విజయపతాకాలు ఎగిరేశారు. ప్రతిష్ఠాత్మక ట్రోఫీ మోహన్‌బగాన్ వశమైంది. "ఆంగ్లేయులు అజేయులేమీ కారని స్వదేశీ ఉద్యమకారులకు మోహన్‌బగాన్ ఆటగాళ్లు నిరూపించారు" అని మ్యాచ్ చూసిన ఓ ఆంగ్లేయుడు వ్యాఖ్యానించారు. వాణిజ్య సంస్థలు కూడా ఈ విజయాన్ని పురస్కరించుకొని తమ వస్తువులపై నెలల పాటు 'బగాన్ డిస్కౌంట్' ప్రకటించాయి.
మోహన్ బగాన్ విజయం తర్వాత కొద్దినెలలకు బెంగాల్ విభజనను బ్రిటిష్ సర్కారు వెనక్కి తీసుకుంది. కోల్‌కతా నుంచి తమ రాజధానిని దిల్లీకి మార్చింది. సాకర్ విజయానికి ఈ నిర్ణయానికి నేరుగా సంబంధం లేకున్నా బ్రిటిష్‌వారు తరలిపోవాలంటే మోహన్‌బగాన్ ఐఎఫ్‌ఏ షీల్డ్ నెగ్గాల్సిందేననే సెంటిమెంటు బలంగా విన్పించింది. 1947లో మోహన్‌బగాన్ మళ్లీ ఈ షీల్డ్ నెగ్గటం మనకు (indian independece movement) స్వాతంత్య్రం రావటం యాదృచ్ఛికం!
ఇదీ చదవండి:Azadi Ka Amrit Mahotsav: మాట వింటారనుకుంటే మంట పెట్టారు..