మెరుగైన పనితీరుతోనే విమర్శలకు సమాధానం చెప్పాలని సభ్యులకు సూచించారు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఆదివారం ఆయన నివాసంలో పలు పార్టీల నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. పార్లమెంటు పనితీరుపై ఇటీవల సుప్రీంకోర్టు విమర్శలు చేసిందని పలువురు పేర్కొన్నారు. రాజ్యాంగ సంస్థలే ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని అడ్డుకోవాలని కోరారు.
దీనిపై వెంకయ్య నాయుడు స్పందిస్తూ "మీ అభిప్రాయాలను అర్థం చేసుకోగలను. సమావేశాలకు తరచూ అంతరాయం కలగడం, సభ్యులు ఇష్టారీతిన ప్రవర్తించడం వంటి సంఘటనల కారణంగానే అలాంటి విమర్శలు వచ్చాయి. సభ గౌరవ, మర్యాదలు కాపాడే విధంగా ప్రవర్తించి, మెరుగైన పనితీరును ప్రదర్శించడం ద్వారానే అలాంటి వాటికి సమాధానం ఇవ్వగలం" అని చెప్పారు. అంతరాయాల కారణంగా గత సమావేశాల్లో దాదాపు 70 శాతం సమయం వృథా అయిందని ఇంకొందరు సభ్యులు తెలిపారు. సభ సజావుగా నడవాలనే అందరం కోరుకుంటున్నామని చెప్పారు. సభలో సమన్వయం కోసం ప్రభుత్వం తరఫున మంత్రులు ప్రతిపక్షాలతో నిరంతరం మాట్లాడుతూ ఉండాలని సూచించారు. ఈ సమావేశాలు ఉత్పాదకంగా సాగడానికి అందరూ సహకరించాలని కోరారు. ఈ భేటీలో దాదాపు 40 మంది నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : ఒక్కరోజులోనే అత్యాచార కేసు తీర్పు- దోషికి జీవితఖైదు