కరోనా మహమ్మారికి సంబంధించిన అన్ని అంశాలపై సమగ్ర చర్చలు జరపాలని ఎంపీలకు విజ్ఞప్తి చేశారు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు. ఇలా చేస్తే... మూడో దశ ముప్పును అడ్డుకోవడానికి మంచి అవకాశముందని తెలిపారు. దేశంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పార్లమెంట్ సమావేశాలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయని పేర్కొన్నారు. సమావేశాలను అర్థవంతంగా జరపాలని సభ్యులకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు విశ్వసనీయతను కాపాడాల్సిన బాధ్యత సభ్యులందరిపై ఉందని అన్నారు.
"దేశంలో గత ఏడాదిన్నరగా దేశ ప్రజలు కరోనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ మాహమ్మారి.. ప్రజల ఆరోగ్యాలనే గాక ఆర్థిక పరిస్థితులను దెబ్బతీసింది. ఈ అనిశ్చితి ఇంకా ఎంత కాలం ఉంటుందో తెలియదు. అవసరమైన అన్ని విషయాలపై నిర్మాణాత్మకంగా చర్చిస్తూ.. ప్రజలకు మద్దతుగా పార్లమెంట్ నిలవాలి. ఈ సమావేశాలను ప్రతి సభ్యుడు సమర్థంగా వినియోగించుకోవాలి. గత నాలుగు సెషన్లను కరోనా కారణంగా కుదించాము. గత శీతాకాల సమావేశం పూర్తిగా రద్దు చేశాము. ఈ సారి పూర్తిగా సమావేశాలను నిర్వహించుకుంటామని ఆశిస్తున్నాను. కరోనా సవాళ్లను మనమంతా సమష్టిగా ఎదుర్కోవాలి."
-వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి
సమష్టి కృషి ఫలితంగా కరోనాను ఎదుర్కొనడంలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్ మెరుగ్గా ఉందని వెంకయ్య నాయుడు అన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. సభలకు సందర్శకులకు అనుమతి ఉండబోదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:'దేశ ప్రజాస్వామ్య ప్రతిష్ఠను దిగజార్చేందుకే ఆ కథనాలు'