రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని సంబంధిత అధికార వర్గాల నుంచి అనుమతులు పొందిన వారు నమోదిత వాహన తుక్కు కేంద్రాల (ఆర్‌వీఎస్‌ఎఫ్)ను ఏర్పాటు చేయొచ్చని గురువారం కేంద్రం విడుదల చేసిన ముసాయిదా మార్గదర్శకాలు వెల్లడిస్తున్నాయి. ఆయా రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాలకు లోబడి ఏదైనా వ్యక్తి, సంస్థ, సొసైటీ లేదా ట్రస్ట్ ఈ తుక్కు కేంద్రాలను ఏర్పాటు చేయొచ్చు. పాత వాహనాలను ఈ నమోదిత సంస్థలు తుక్కుగా మారుస్తాయి. వచ్చే రెండేళ్లలో 100 తుక్కు కేంద్రాలు అందుబాటులోకి వస్తాయని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నితిన్ గడ్కరీ ప్రకటించారు. మోటారు వాహనాల నిబంధనలు 2021 కింద ఏర్పాటయ్యే ఈ కేంద్రాల కోసం రూ.లక్ష చొప్పున ప్రాసిసెంగ్ ఫీజును ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ఫీజును సంబంధిత రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతం కూడా నిర్ణయించవచ్చు. ప్రతి కేంద్రానికి రూ.10 లక్షల బ్యాంకు హామీ సైతం ఇవ్వాలి. దరఖాస్తు చేసిన 60 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ అనుమతులు ఇచ్చేదీ, లేనిదీ తెలపాల్సి ఉంటుంది.
- వాహనాల రిజిస్ట్రేషన్ వివరాలు ఉండే వాహన్ డేటాబేస్‌కు ఈ కేంద్రాలను అనుసంధానిస్తారు. తుక్కుగా తీసుకువస్తున్న వాహనాల్లో దొంగిలించినవి ఉన్నాయేమో తెలుసుకునేందుకు స్థానిక పోలీసులు, ఎన్‌సీఆర్‌బీ నుంచీ ఈ కేంద్రాలకు సమాచారం అందుతుంది. వాహనాన్ని తుక్కుగా మార్చేముందు క్షుణ్నంగా సంబంధిత యజమాని, వాహన వివరాలన్నీ పరిశీలించాల్సిందే. తదుపరి 6 నెలల పాటు ఈ వివరాలు భద్రపరచాలి.
- ఫిట్‌నెస్ లేని, రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ కాని, ప్రమాదం/అగ్నిప్రమాదం/ప్రకృతి విపత్తుల్లో ధ్వంసమై, సంబంధిత యజమాని స్వీయ ధ్రువీకరణ ఇచ్చిన వాహనాన్నే తుక్కుగా మార్చాలి.
- ప్రభుత్వ సంస్థల వాహనాలైతే, వాడకానికి పనికిరానివని/మరమ్మతుకు అధిక వ్యయం అయ్యేవి తుక్కుగా చేయొచ్చు.
- 30 రోజుల్లోగా ఈ ముసాయిదా నిబంధనలపై అన్ని వర్గాలూ స్పందించవచ్చు.
ఇదీ చదవండి : బీమా సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం