మృతిచెందిన వారి అస్థికలను గంగానదిలో కలపటం పవిత్రమైనదిగా భావిస్తుంటారు హిందువులు. అయితే కరోనా కారణంగా విధించిన ఆంక్షలతో అది క్లిష్టంగా మారింది. అస్థికలను గంగానదిలో కలపలేని వారికోసం నూతన విధానాన్ని పోస్టల్ శాఖ అందుబాటులోకి తెచ్చింది.
పోర్టల్ ద్వారా..
వారణాసిలోని ఓమ్ దివ్య దర్శన్ అనే సామాజిక సేవాసంస్థ సంయుక్తంగా స్పీడ్ పోస్ట్ విధానాన్ని ప్రారంభించింది. దేశంలో ఎక్కడి నుంచైనా అస్థికలను స్పీడ్ పోస్ట్ ద్వారా ఓమ్ దివ్య దర్శన్ కార్యాలయానికి పంపించవచ్చు. వీటిని ఎన్జీఓ సిబ్బంది.. వారణాసి, ప్రయాగ్రాజ్, హరిద్వార్, గయాలో నిమజ్జనం చేస్తారు. అయితే స్పీడ్ పోస్ట్ చేసేవారు ముందుగా ఓమ్ దివ్య దర్శన్ పోర్టల్లో పేరు నమోదు చేసుకోవాలని వారణాసి పోస్ట్మాస్టర్ జనరల్ కృష్ణ కుమార్ యాదవ్ తెలిపారు.
శాస్త్రోక్తంగా..
ఓమ్ దివ్య దర్శన్ సేవాసంస్థ సభ్యులు.. శాస్త్రోక్తంగా అస్థికలు నిమజ్జనం చేస్తారని వివరించారు. ఈ కార్యక్రమం తర్వాత ఓ బాటిల్లో గంగానది నీటిని తిరిగి.. ఆయా కుటుంబ సభ్యులకు పోస్ట్ ద్వారా పంపిస్తారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : కొవిడ్ టెస్ట్ లేకుండానే ఆ ప్రయాణికులకు అనుమతి!