Vadnagar Oldest City : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వస్థలమైన గుజరాత్లోని వాద్నగర్లో 2,800 ఏళ్ల నాటి మానవ ఆవాస ఆనవాళ్లు బయటపడ్డాయి. కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో తవ్వకాలు ( Vadnagar Excavation ) జరిపిన పురాతత్వ అధికారులు ఈ ఆనవాళ్లను వెలుగులోకి తెచ్చారు. ఐఐటీ- ఖరగ్పుర్, భారత పురాతత్వ సంస్థ (ఏఎస్ఐ), భౌతిక శాస్త్ర ప్రయోగశాల (ఫిజిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ PRL, అహ్మదాబాద్), జనవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU), దక్కన్ కాలేజీలకు చెందిన పరిశోధకులు ఈ తవ్వకాల్లో బయటపడిన ఆనవాళ్లను పరిశీలించారు. వాద్నగర్లో కనిపించిన ఈ ఆవాసాలు క్రీస్తు పూర్వం 800 నాటివని వారు నిర్ధరించారు.


Vadnagar Archaeology : వాద్నగర్ తవ్వకాల్లో ఏడు సాంస్కృతిక దశలు బయటపడ్డాయి. ప్రాచీన బౌద్ధ, మౌర్య, ఇండో-గ్రీకు, శక-క్షాత్రప, హిందూ సోలంకి, దిల్లీ సుల్తాన్- మొఘల్, గైక్వాడ్- బ్రిటిష్ వలస పాలనకు చెందిన సాంస్కృతిక దశలను ఇక్కడ గుర్తించారు. తవ్వకాల్లో భాగంగా పురాతన బౌద్ధారామ చిహ్నాలను పరిశోధకులు గుర్తించారు. యవన (గ్రీకు) రాజు అపోలోడాటస్ కాలానికి చెందిన నాణేల ముద్రణ అచ్చులు సైతం బయటపడ్డాయి. వీటితో పాటు బంగారం, వెండి, రాగి, ఇనుము, మట్టిపాత్రలు, పూసల గాజులు సైతం కనిపించాయి.


"గత 4-5 ఏళ్లుగా మేం వాద్నగర్ తవ్వకాలకు సంబంధించిన పనుల్లో భాగమయ్యాం. ఏఎస్ఐతో కలిసి పనిచేస్తున్నాం. ఏఎస్ఐ ఇక్కడ చాలా కాలం నుంచి పని చేస్తోంది. 20 మీటర్ల లోతు వరకు తవ్వకాలు జరిగాయి. వాద్నగర్ చరిత్ర చాలా పురాతనమైనది. ప్రాచీన బౌద్ధ విహార ఆనవాళ్లు కూడా గుర్తించాం. అనేక సాంస్కృతిక దశలు ఇక్కడ వెలుగుచూశాయి. అందులో అతి పురాతనమైనది 2800 ఏళ్ల నాటిది."
-డా. అనింద్య సర్కార్, జియాలజీ, జియోఫిజిక్స్ విభాగ ప్రొఫెసర్, ఐఐటీ ఖరగ్పుర్
సమృద్ధిగా నీరు- మధ్యాసియా తెగల దాడులు
3 వేల ఏళ్లుగా ఈ ప్రాంతంలో ఎన్నో రాజ్యాల ఉత్థానపతనాలు సంభవించాయని పరిశోధకులు తెలిపారు. అనావృష్టి లాంటి వాతావరణ వైపరీత్యాల నేపథ్యంలో మధ్యాసియాకు చెందిన తెగలు తరచుగా ఈ రాజ్యాలపై దాడులు చేశాయని వెల్లడించారు.

"ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి తవ్వకాలు కొనసాగుతున్నాయి. వాద్నగర్లో 30 ప్రాంతాలను మేం గుర్తించాం. ఇప్పటివరకు లక్షకు పైగా ఆనవాళ్లను వెలికి తీశాం. సమృద్ధిగా నీరు ఉండటం, నీటి సరఫరా వ్యవస్థ మెరుగ్గా ఉండటం వల్ల ఈ ప్రాంతం ఏళ్ల పాటు మనుగడ సాధించింది. బౌద్ధం, జైనం, హిందూ మతాలకు చెందిన ప్రజలు ఇక్కడ కలిసిమెలిసి జీవించారు."
- ముకేశ్ ఠాకూర్, ఆర్కియలాజికల్ సూపర్వైజర్
అంతకన్నా పురాతన ప్రాంతమే!
దేశంలో ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు మానవులు నివసిస్తున్న ఏకైక నగరం వాద్నగరేనని తేలింది. వివిధ సాంస్కృతిక కాలాలకు చెందిన పురావస్తు అవశేషాలు ఒకే చోట చెక్కు చెదరకుండా కనిపించడం కూడా ఓ విశేషమే. హరప్పా నాగరికత మలి దశ- అంటే క్రీస్తు పూర్వం 1400 నుంచే వాద్నగర్ ప్రాంతం మానవ ఆవాసంగా వర్ధిల్లి ఉండొచ్చని నిపుణుల అంచనా. హరప్పా లేదా సింధు నాగరికత కాలం నుంచే వాద్నగర్ ఉనికిలో ఉన్నట్లు తేలితే భారత్లో 5,500 సంవత్సరాల నుంచి మానవ నాగరికత ఉందని భావించవచ్చు.

10 వేల ఏళ్లనాటి శివుడి త్రిశూలం.. 3వేల సంవత్సరాల వజ్రాయుధం లభ్యం.. ఎక్కడో తెలుసా?
7వేల ఏళ్లనాటి కలప బావి.. ఇప్పుడు బయటపడింది!
ఆ హాల్లో 2500 ఏళ్లనాటి ఈజిప్టు మమ్మీ
1,100 ఏళ్ల నాటి బైబిల్.. రూ.300 కోట్లకు వేలం.. స్పెషల్ ఏంటంటే?