బస్సులో 55 మంది ప్రయాణికులు... వేగం గంటకు 100 కిలోమీటర్లు.. సాఫీగానే ప్రయాణం సాగుతోందని బస్సులోని వారంతా అనుకుంటున్నారు.. ఇంతలోనే బస్సు అటూఇటూ కదులుతూ వెళ్తోంది. తీరా చూస్తే.. డ్రైవర్ స్పృహ కోల్పోయాడు. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా హడలెత్తిపోయారు. పెద్ద ఎత్తున హాహాకారాలు చేశారు. అప్పుడే హీరోలా వచ్చిన ఓ జవాన్.. చాకచక్యంగా బస్సును అదుపు చేశారు. డ్రైవర్‌ను పక్కకు లాగి.. స్టీరింగ్ తన చేతిలోకి తీసుకున్నారు. అనంతరం బ్రేకులు వేసి.. బస్సును ఓ పక్కకు ఆపారు. ఉత్తరాఖండ్‌లోని జిల్లాలో ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్ రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఓ బస్సు.. మంగళవారం దిల్లీ నుంచి హల్ద్వానీ వెళుతోంది. హల్ద్వానీ- రుద్రపుర్ రోడ్డు మార్గంలో బస్‌డ్రైవర్ సడెన్‌గా స్పృహ కోల్పోయాడు. అదే బస్సులో ప్రయాణిస్తున్న సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రమాదం నుంచి ప్రయాణికులందరిని కాపాడగలిగారు. దీంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు.
తప్పతాగి డ్రైవింగ్?
విధుల్లో ఉండగానే డ్రైవర్, కండక్టర్ మద్యం తాగారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అనంతరం ప్రయాణికులందరిని మరో బస్సులో గమ్యస్థానాలకు పంపించారు.
ఘటనపై ఉత్తరాఖండ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏఆర్ఎమ్ సురేంద్ర సింగ్ వివరణ ఇచ్చారు. ఈ బస్సు కాంట్రాక్ట్ కింద నడుస్తోందని ఆయన తెలిపారు. బస్సు యజమాని నుంచి వివరణ కోరినట్లు వెల్లడించారు. మెడికల్ రిపోర్ట్ వచ్చిన తరువాతే.. డ్రైవర్ స్పృహ కోల్పోవడానికి గల అసలైన కారణాలు తెలుస్తాయని సురేంద్ర సింగ్ వివరించారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు. డ్రైవర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు వారు వెల్లడించారు.
యువతిపైకి దూసుకొచ్చిన లారీ..
కొద్ది రోజుల క్రితం ఇదే ఉత్తరాఖండ్‌లోని దెహ్రాదూన్‌లో ఓ యువతి.. త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడింది. లారీ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడం వల్ల ఆమె ప్రాణాలు నిలిచాయి. డోయివాల్లోని టోల్‌ప్లాజా వద్ద జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో.. అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే?.. ఓ యువతి మధ్యాహ్న సమయంలో తన స్కూటీపై దెహ్రాదూన్ నుంచి బయలుదేరింది. మార్గమధ్యలో ఆమె లచ్చివాలా టోల్‌ప్లాజాకు చేరుకుంది. అదే సమయంలో ఆమె వెనుక ఓ ట్రక్కు వస్తోంది. ఒక్కసారిగా ఆ వాహనం బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో ఆ ట్రక్కు ఆమెపైకి దూసుకెళ్తుండగా.. వెంటనే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి.. రోడ్డు పక్కకు పోనిచ్చాడు. దీంతో యువతి స్వల్ప గాయాలతో బయటపడింది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.