పెళ్లి కుదిరిన యువతిని ప్రేమిస్తున్నానంటూ.. కొన్ని రోజులుగా ఓ పోకిరి ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. తనకు ఇష్టం లేదని అమ్మాయి ఎన్నిసార్లు చెప్పినా వినకుండా.. తనను ప్రేమించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఆమెను భయభ్రాంతులకు గురి చేశాడు. ఆమెకు కాబోయే భర్తకు సైతం ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు ఆ యువకుడు. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లో జరిగింది.
ఇదీ కథ..
ఉత్తర్ప్రదేశ్ కాన్పూర్ బర్రా ప్రాంతానికి చెందిన ఓ యువతి బీఏ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమెకు ఇటీవలె పెళ్లి కుదిరింది. ఆయితే కొంత కాలంగా యువతి సమీప కాలనీలో ఉండే ఓ యువకుడు.. ఆమెను ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు. తనకు ఇష్టం లేదని.. పెళ్లి నిశ్చయమైందని పలుమార్లు చెప్పిన వినిపించుకోకుండా ఆమెను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. యువతి శనివారం ఉదయం పరీక్ష రాసేందుకు ఇంటి నుంచి బయలుదేరగా.. ఆమె వెంటపడ్డాడు యువకుడు. ఆమెను మార్గమధ్యలో రోడ్డుపై అడ్డుకొని.. ప్రేమించాలంటూ ఇబ్బంది పెట్టాడు. ఒక్కసారిగా తన జేబులో నుంచి సింధూరం తీసి అమ్మాయి నుదుట పెట్టి.. 'మన ఇద్దరినీ ఇప్పుడు ఎవరూ విడదీయలేరంటూ' బెదిరింపులకు దిగాడు. నడి రోడ్డుపై యువకుడి వెకిలి చేష్టలు చూసి చుట్టు పక్కల వారు ఆశ్చర్యానికి గురయ్యారు.
అనంతరం తన ఫోన్ లాక్కొని వెళ్లిపోయాడని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ ఫ్రెండ్ సహాయంతో యువతి జరిగిన విషయాన్ని ఇంట్లో వారికి వివరించింది. సమస్యను తెలుసుకున్న కుటుంబసభ్యులు స్థానిక కిద్వాయి నగర్ పోలీస్ స్టేషన్లో యువకుడిపై ఫిర్యాదు చేశారు. దీంతో యువకుడి తల్లిదండ్రులు .. అమ్మాయి కుటుంబసభ్యులకు క్షమాపణలు చెప్పారు. తమ కుమారుడు ఓ కోర్టు కేసు వల్ల మనస్తాపం చెంది ఇలా ప్రవర్తించాడని.. అతడిపై కేసును వెనక్కి తీసుకోవాలంటూ యువకుడి తల్లిదండ్రులు వారికి విజ్ఞప్తి చేశారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు కేసు విషయంపై వెనక్కి తగ్గారు.
"బీర్సింగ్ అనే యువకుడు కొంత కాలంగా నన్ను ప్రేమిస్తున్నానంటూ వెంట పడుతున్నాడు. ప్రస్తుతం నేను బీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. శనివారం ఇంగ్లిష్ పరీక్ష రాసేందుకు ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి వెళ్లాను. అతడు రోడ్డు మధ్యలో నన్ను ఆపి నా చేయి పట్టుకున్నాడు. తర్వాత నా ఫోన్ లాక్కొని తన జేబులో వేసుకున్నాడు. నాకు సింధూరం పెట్టి.. మనల్ని ఎవరూ విడదీయలేరన్నాడు. నాకు పరీక్ష ఉందని చెప్పినా కూడా వదల్లేదు. నాకు పెళ్లి కుదిరిందని తెలిసి.. నా కాబోయే భర్తను కూడా బెదిరించాడు.
- యువతి