పాముతో భార్యను కరిపించి హత్య చేసిన కేసులో దోషిగా తేలిన భర్తకు.. కేరళలోని జిల్లా కోర్టు(uthra murder case verdict ) రెండు జీవిత ఖైదులు విధించింది. దీనితోపాటు రూ.5.85లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తం చెల్లించనట్లయితే అదనపు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఉద్దేశపూర్వకంగానే పాముతో కాటు వేయించినట్లు నిర్ధరణ కావడంతో ఈ కీలక తీర్పునిచ్చింది కొల్లాం జిల్లా కోర్టు(uthra murder case verdict). ఈ కేసులో అక్టోబర్ 11న విచారణ ముగించిన కోర్టు.. తాజాగా శిక్షను ఖరారు చేసింది.
ఈ కేసు తీర్పు సందర్భంగా.. అత్యంత అరుదైన ఘటనల్లో ఇది ఒకటని కొల్లం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎం.మనోజ్ పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసులో తన క్లయింట్‌ను ఇరికించారని సూరజ్ తరఫున న్యాయవాది వాదించారు. ఉత్రా మరణం సహజమైన పాము కాటుతోనే జరిగిందన్నారు.
ఇదిలా ఉంటే.. దోషికి మరణశిక్ష విధించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.
దర్యాప్తు సాగిందిలా..
ఈ కేసులో నిందితునికి శిక్ష పడేందుకు కేరళ పోలీసులు విస్తృత దర్యాప్తు చేపట్టారు. నిందితులు శిక్ష నుంచి తప్పించుకునేందుకు అవకాశం లేకుండా అన్నిరకాల ఆధారాలను సేకరించారు. నాగ్‌పూర్, ఇందోర్లలో వెలుగుచూసిన ఈ తరహా కేసులను అధ్యయనం చేశారు. 'ఉత్రాను' పాము ఎలా కరించిందో డమ్మీ ప్రయోగం చేసి నిర్ధరించారు. సాక్ష్యాలను నిరూపించేందుకు 87 మందిని విచారించిన పోలీసులు 1000 పేజీల ఛార్జ్ షీట్ సమర్పించారు. సెక్షన్ 302 ఐపీసీ(హత్య), 326 (హాని కలిగించే పదార్థాల ద్వారా గాయపరచడం), 307 (హత్యాయత్నం), 201 (సాక్ష్యాలను ధ్వంసం చేయడం) కింద అభియోగాలు మోపారు.
కేసు ఇదే..
కేరళ కొల్లాం జిల్లాలోని అంచల్ పట్టణానికి చెందిన ఉత్రా, సూరజ్ భార్యభర్తలు. పెళ్లి తర్వాత కొన్నాళ్లుగా బాగానే ఉన్న సూరజ్.. తరువాత మరో అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకున్నాడు. అందుకు అడ్డంగా ఉన్న తన భార్యను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా హత్య(Uthra case) చేయాలని పథకం రచించాడు.
యూట్యూబ్‌లో చూసి పాముల ద్వారా ఎలా హత్య చేయాలో నేర్చుకున్నాడు. సురేష్ అనే పాములవాడికి డబ్బులు ఇచ్చి విష సర్పాన్ని తీసుకున్నాడు. ఇంటికి వచ్చి నిద్రపోతున్న భార్యపై ఆ పామును విసిరేయగా.. ఆమెను రెండు సార్లు కాటువేసింది. ఉత్రా ప్రాణాలు కోల్పోయింది. అంతకు ముందే ఓసారి పాము కాటుకు గురికావటంపై అనుమానించిన ఉత్రా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూరజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలీలో విచారించి నిజాలు రాబట్టారు.
ఇవీ చూడండి: