రైతుల పట్ల భాజపా ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై విమర్శలు ఎక్కుపెట్టింది శివసేన. ఉత్తర భారతంలో విపరీతమైన చలి ఉన్న వేళ.. రైతులపై జల ఫిరంగులను ప్రయోగించడాన్ని క్రూరమైన చర్యగా అభివర్ణించింది. రైతులను ప్రభుత్వం.. ఉగ్రవాదులుగా భావిస్తోందిన ఆరోపించింది. ఈ మేరకు తమ అధికారిక పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో రాసుకొచ్చింది శివసేన.
"మన దేశంలో రైతుల్ని ఉగ్రవాదుల్లాగా భావిస్తున్నారు. సరిహద్దులో సైనికులపై ఉగ్రవాదులు దాడి చేస్తుంటే.. ఇక్కడేమో రైతులపై దాడులకు దిగుతున్నారు. గుజరాత్లో రైతుల నేత సర్దార్ వల్లాభాయ్ పటేల్ విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆవిష్కరించారు. రైతులపై ఇప్పుడు జరుగుతున్న ఆగడాలను చూసి ఆ విగ్రహం కన్నీరు పెట్టుకుంటోంది."
-- శివసేన
రైతులు చేస్తున్న ఆందోళనలకు 'ఖలిస్థానీ'తో సంబంధాలు ఉన్నాయని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ చేసిన వ్యాఖ్యలను శివసేన ఖండించింది. అరాచకాన్ని సృష్టించేందుకే భాజపాకు కావాలని ఆరోపణలు చేస్తోందని మండిపడింది. ప్రత్యర్థులను అణచివేయడానకి సర్వశక్తులను ఉపయోగిస్తున్న ప్రభుత్వం.. సరిహద్దులో శత్రవులతో ఎందుకు పోరాడలేకపోతోందని విమర్శించింది. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సంస్థలైన సీబీఐ, ఈడీలను ప్రభుత్వం తమ రాజకీయ శక్తులను ఎదుర్కొనేందుకు ఆయుధంలా ఉపయోగించుకుంటోందని తన వ్యాసంలో పేర్కొంది శివసేన.
ఇదీ చూడండి:ఐదో రోజుకు అన్నదాతల ఆందోళన