దళిత వర్గానికి చెందిన ఓ బాలుడు గుడిలోకి ప్రవేశించాడనే కారణంతో అగ్రకులానికి చెందిన కొందరు ఆలయాన్ని శుభ్రపరిచారు. అంతటితో ఆగక చిన్నారి తల్లిదండ్రులకు రూ.11వేలు జరిమానా విధించారు.
ఇదీ జరిగింది..
కర్ణాటక కొప్పల్ జిల్లాలో(Koppal Latest News) చన్నాదశర వర్గానికి చెందిన ఓ బాలుడు తన పుట్టినరోజు(సెప్టెంబర్ 4) సందర్భంగా తన గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామంలోని అగ్రవర్ణ ప్రజలు.. సెప్టెంబర్ 11న పంచాయతీ నిర్వహించారు. దళిత చిన్నారి ప్రవేశంతో దేవాలయం అపవిత్రంగా మారిందని.. దానిని శుభ్రం చేయాలని తీర్మానించారు. అలాగే పిల్లవాడి తల్లిదండ్రులకు రూ.11,000 జరిమానా విధించారు.
అభ్యంతరం..
అగ్రకులస్తులు నిర్వహించిన పంచాయతీ, వారి తీర్మానంపై చన్నాదశర సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. వారి నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. మరోవైపు ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న కుష్టగి మండల తహసీల్దార్ సిద్ధేశ, డిప్యూటీ ఎస్పీ రుద్రేశ్ ఉజ్జినకొప్ప గ్రామానికి చేరుకొని అగ్రకులస్తులతో సమావేశం నిర్వహించారు. అంటరానితనాన్ని పాటించొద్దని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
ఇవీ చదవండి: