రియల్ ఎస్టేట్ వ్యాపార దిగ్గజాలు సుశీల్ అన్సాల్, గోపాల్ అన్సాల్కు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది దిల్లీ కోర్టు. 1997లో 59మంది ప్రాణాలను బలిగొన్న ఉపహార్ థియేటర్ ఘోర అగ్నిప్రమాదం కేసులో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించినందుకు ఈ శిక్ష ఖరారు చేసింది. ఇద్దరికీ చెరో రూ.2.25కోట్ల జరిమానా కూడా విధించింది. చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ పంకజ్ శర్మ ఈ మేరకు తీర్పు వెలువరించారు. ఎన్నో రాత్రులు ఆలోచించిన తర్వాత వీరికి ఈ శిక్షే సరైనది భావించి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
సాక్ష్యాలను తారుమారు చేసేందుకు సహకరించిన కోర్టు మాజీ సిబ్బంది పీపీ బత్రా, అనూప్ సింగ్కు కూడా ఏడేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది న్యాయస్థానం. చెరో రూ.3లక్షల జరిమానా విధించింది.
బెయిల్పై ఉన్న సుశీల్, గోపాల్ అన్సాల్ను కోర్టు ఆదేశాలతో పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
1997 జూన్ 13న ఉపహార్ సినిమా థియేటర్లో 'బోర్డర్' సినిమా ప్రదర్శిస్తుండగా ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ విషాద ఘటనలో 59మంది మరణించారు.
ఈ కేసులో సుప్రీంకోర్టు ఇప్పటికే సుశీల్, గోపాల్ అన్సాల్ను దోషులుగా తేల్చి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఇద్దరికీ చెరో రూ.30కోట్లు జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని దిల్లీలో ట్రామా సెంటర్ నిర్మాణానికి ఉపయోగించాలని సూచించింది.
ఇదీ చదవండి: ఆ మహిళలకు మౌలిక సదుపాయాలపై కేంద్రానికి నోటీసులు