UP Congress Youth Manifesto: ఉత్తర్ప్రదేశ్లో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో.. యువతను ఉద్దేశించి ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. దీనికి 'భర్తీ విధాన్' అని పేరుపెట్టింది. దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మేనిఫెస్టో ఆవిష్కరించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ.
అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలను అన్నింటినీ భర్తీ చేయాలని కాంగ్రెస్ తీర్మానించింది. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇందులో మహిళలకే 8 లక్షలు కేటాయించింది.
ఈ సందర్భంగా.. యువతకు మంచి భవిష్యత్తు కాంగ్రెస్తోనే సాధ్యమని అన్నారు రాహుల్. యువతను సంప్రదించి వారి దృక్కోణాలు ప్రతిబింబించేలా ఈ మేనిఫెస్టో రూపొందించినట్లు పేర్కొన్నారు.
''ఉత్తర్ప్రదేశ్ యువతకు మంచి భవిష్యత్తు కావాలి. అది కాంగ్రెస్ మాత్రమే సాధ్యం చేయగలదు. మేం విద్వేషాలను వ్యాప్తి చేయబోం. ప్రజలను ఏకం చేస్తాం. యువతను బలంగా తీర్చిదిద్ది.. సరికొత్త ఉత్తర్ప్రదేశ్ను సృష్టిస్తాం.''
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు
రాష్ట్రంలో యువత నిరాశలో ఉన్నారని, నిరుద్యోగమే అతిపెద్ద సమస్య అని అన్నారు ప్రియాంకా గాంధీ. కుల, మత రాజకీయాల జోలికి వెళ్లకుండా.. రాష్ట్రాభివృద్ధినే కాంగ్రెస్ కోరుకుంటోందని ఆమె అన్నారు.
యువత, మహిళలకు పెద్దపీట వేస్తూ కాంగ్రెస్ యూపీలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తోంది. కాంగ్రెస్ పోటీచేయనున్న స్థానాల్లో 40 శాతం మహిళలకే అని ఇదివరకే ప్రకటించారు ప్రియాంక.
UP Polls 2022: మొత్తం 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీకి ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 10న మొదలై.. మార్చి 7న చివరిదశతో ఎన్నికలు ముగుస్తాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇవీ చూడండి: ప్రియాంక ఎంట్రీతో యూపీ ఎన్నికల్లో నష్టం ఎవరికి ?