మహిళకు రిజర్వ్డ్ అయిన స్థానాన్ని దక్కించుకునేందుకు 45 ఏళ్ల వయసులో ఓ రాజకీయ నాయకుడు ఈ ఏడాది ఏప్రిల్‌లో వివాహం చేసుకున్నారు. మే 4న జరిగిన ఉత్తర్‌ప్రదేశ్ నగర పాలిక ఎన్నికల్లో ఆయన భార్య విజయం సాధించారు. దీంతో ఆమె రాంపుర్ నగర పాలిక పరిషత్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అసలేం జరిగిందంటే..
ఉత్తర్‌ప్రదేశ్‌లో గత నెలలో మున్సిపాలిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. నామినేషన్ దాఖలుకు ఏప్రిల్ 17వ తేదీని ఆఖరి గడువుగా ప్రకటించారు. అయితే రాంపుర్కు చెందిన ఆప్ నాయకుడు మామూన్ షా ఖాన్(45).. మున్సిపాలిటీ అధ్యక్ష పదవికి పోటీ చేద్దామనుకున్నారు. అందుకు కొన్ని నెలల ముందు నుంచే ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. ఇదే సమయంలో నగరపాలిక ఛైర్పర్సన్ పదవి సీటు.. మహిళలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా ఆయన నిరాశ చెందారు.
ఎలా అయినా అధ్యక్ష పదవికి పోటీ చేయాలని అనుకున్నారు మామూన్ షా ఖాన్. అప్పుడే ఆయనకు తన అనుచరులు ఓ సలహా ఇచ్చారు. వివాహం చేసుకుని.. తన భార్యను అధ్యక్ష పదవికి పోటీలో దించమని సూచించారు. వెంటనే అంతా.. మామూన్ కోసం వధువును వెతికారు. 45 గంటల్లోనే ఆప్ నేతకు వివాహ సంబంధం ఖరారైంది. వెంటనే పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టారు. మామూన్ షా ఖాన్.. సనా ఖానం అనే మహిళను ఏప్రిల్ 15న వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత రోజే ఆమె నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
కాంగ్రెస్ పార్టీని వీడి మామూన్ ఖాన్ నామినేషన్‌కు ముందే ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆయన అంతకుముందు కాంగ్రెస్ పార్టీ రాంపుర్ నగర అధ్యక్షుడిగా పని చేశారు. అదే అనుభవంతో ఈసారి ఆప్ తరఫున తన భార్య సనాతో కలిసి ప్రచారం చేశారు. రాంపుర్‌లో పోలియో నిర్మూలనకు కృషి చేశానని ఓటర్లను అభ్యర్థించారు. గత 20 ఏళ్లుగా ప్రజలకు సేవ చేస్తున్నానని విన్నవించారు. దీంతో ఆయన భార్య సనా ఖానం మే 13న విడుదలైన మున్నిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థిపై 10,948 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాంపుర్‌లో సమాజ్‌వాదీ పార్టీ మూడో స్థానానికి పడిపోయింది. రాంపుర్ కొన్నాళ్ల క్రితం వరకు ఎస్పీకి అడ్డా అని చెప్పొచ్చు. ఆ పార్టీ నేత ఆజం ఖాన్‌కు ఆ ప్రాంతంలో గట్టి పట్టుంది. అయినా ఎస్పీ విజయం సాధించలేకపోయింది.
'నేను మామూన్ ఖాన్ పెళ్లి చేసుకోనున్న నెలలో రంజాన్ పండగ వచ్చింది. ఆ నెల పవిత్రమైనది. రాంపుర్ మున్సిపల్ ఛైర్మన్ సీటు మహిళకు రిజర్వ్ అయ్యింది. దీంతో ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నా. ప్రచార సమయంలో ప్రజల సమస్యలను చాలా దగ్గర నుంచి చూశాను. ఇప్పుడు వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తా. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందడం ఆనందంగా ఉంది. నాకు మద్దతిచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు. నా భర్త మామూన్ నా పక్కనే ఉండి నన్ను గెలిపించారు. '
--సనా ఖానం, మామూన్ ఖాన్ భార్య
మరోవైపు.. గత 40 ఏళ్లుగా సమాజ్‌వాదీ పార్టీకి మాత్రమే ఓటేసిన రాంపుర్ ప్రజలు.. ఇప్పుడు ఆప్‌నకు పట్టం కట్టారని మామూన్ ఖాన్ తెలిపారు. సంక్షోభ సమయంలో ప్రజలకు తాను అండగా ఉండడం వల్ల తన భార్య సనా విజయం సాధించారని అన్నారు.