అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అక్రమంగా విరాళాలు వసూలు చేస్తున్న వ్యక్తిపై ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొరాదాబాద్ జిల్లా భాజపా అధ్యక్షుడు రాజ్‌పాల్ సింగ్ చౌహాన్ ఫిర్యాదు మేరకు ఈ మోసానికి పాల్పడుతున్న వ్యక్తిని గుర్తించారు.
ఫోర్జరీ కేసు..
మందిర నిర్మాణం పేరిట సామాజిక మాధ్యమాలు, ఇంటింటి ప్రచారం ద్వారా విరాళాలు సేకరిస్తున్న వ్యక్తిని ప్రేమ్‌వీర్ సింగ్‌గా గుర్తించామని మజోలా పోలీసు స్టేషన్ అధికారి అవధేశ్ కుమార్ తెలిపారు. ఐపీసీ 419తో పాటు ఐటీ చట్టం(ఫోర్జరీ) కింద కేసు నమోదు చేశామని వివరించారు.
ప్రేమ్‌వీర్ సింగ్ సామాజిక ఖాతాలను పరిశీలించిన పోలీసులు విశ్వ హిందూ మహాశక్తి సంఘ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడికి విరాళాలిచ్చిన దాతల వివరాలను సైతం సేకరించామని, త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.
రామ మందిర నిర్మాణం పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తి గురించి తెలిసిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశా. అతడితో పాటు, అతడికి సహకరించిన వారిని తక్షణమే అరెస్టు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా. అలాగే ఇలాంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ధ్రువీకరణ లేనిదే విరాళాలివ్వొద్దని విజ్ఞప్తి చేస్తున్నా.
-రాజ్‌పాల్ సింగ్ చౌహాన్, మొరాదాబాద్ భాజపా జిల్లా అధ్యక్షుడు
ఇదీ చదవండి: జనవరి నుంచి రామ మందిర పునాది పనులు