ఓ కారు డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోలేదని రూ.1,000 జరిమానా విధించారు ట్రాఫిక్ పోలీసులు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న.. ఈ వింత సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని హమీర్పుర్ జిల్లాలో వెలుగు చూసింది. వార్తాపత్రికలు సరఫరా చేసే ఓ కారు డ్రైవర్‌కు చలానా పడింది. దీంతో చేసేదేమి లేక చివరకు జరిమానా మొత్తాన్ని ఆ రాష్ట్ర రవాణా శాఖకు చెల్లించాడు.
ముస్కరా పట్టణంలోని ఓ ప్రాంతానికి చెందిన పవన్ కుమార్ ఏప్రిల్ 18న తన కారులో వార్తాపత్రికలను సరఫరా చేసి తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో ముస్కరా ట్రాఫిక్ పోలీసులు పవన్ వాహనాన్ని ఆపారు. అక్కడే తనిఖీల్లో ఉన్న స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నంద్ కిషోర్ యాదవ్.. పవన్ కుమార్ కారును ఫొటో తీసి రూ.1,000 చలానా విధించారు. ఎందుకు ఫైన్ వేశారు అని డ్రైవర్ ప్రశ్నించగా.. హెల్మెట్ పెట్టుకోనందుకు చలానా వేశామంటూ ట్రాఫిక్ సిబ్బంది సమాధానం ఇచ్చారు. పైగా పవన్ మొబైల్‌కు చలానాకి సంబంధించిన ఓ మెసేజ్ కూడా వచ్చింది. కారు డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోవడం ఏంటని.. పైగా వాహనం ఆపి మరి చలానా విధించడం ఏంటంటూ పవన్ ట్రాఫిక్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు చలానా రశీదును రద్దు చేస్తామని హామీ ఇచ్చి పంపించేశారు. అయినా సదరు ఇన్వాయిస్ క్యాన్సిల్ కాకపోవడం వల్ల తప్పక రూ.1,000ను చెల్లించాల్సి వచ్చింది. ఈ వ్యవహారంపై కొందరు ముస్కరా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ బ్రజ్మోహన్ను వివరణ కోరగా.. ఇది పొరపాటున జరిగిందని.. చాలా సార్లు ఇలాంటి తప్పిదాలు జరిగాయని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. పవన్ కుమార్ చలానా రద్దు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
సీటు బెల్ట్ లేదని బైక్ డ్రైవర్‌కు చలానా..!
సరిగ్గా ఆరు నెలల క్రితం కూడా ఇలాంటి పొరపాటే కురారా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ స్టేషన్ సిబ్బంది చేసిన తప్పిదంతో ఇద్దరు వ్యక్తులకు తప్పుడు చలాన్ల వేశారు అధికారులు. హెల్మెట్ ధరించనందుకు కారు డ్రైవర్‌కు రూ.1000 చలానాను జారీ చేశారు కురారా పోలీస్ సిబ్బంది. మరో ఘటనలో ద్విచక్రవాహనదారుడు సీటు బెల్టు పెట్టుకోనందుకు అతడికి కూడా వెయ్యి రూపాయల ఫైన్ విధించారు.
అక్కడ రూ.1000.. ఇక్కడ రూ.500..!
గతేడాది డిసెంబర్లో కూడా అచ్చం ఈ తరహా ఘటనే కర్ణాటకలో జరిగింది. హెల్మెట్ పెట్టుకోలేదని ఓ కారు ఓనర్‌కు రూ.500 ఫైన్‌ను విధించారు మంగళూరు ట్రాఫిక్ పోలీసులు. ఫైన్ కట్టాలంటూ సదరు వ్యక్తి మొబైల్‌కు మెసేజ్ పంపింది రవాణా శాఖ. ఇదే విషయంపై ట్రాఫిక్ ఉన్నతాధికారులను సంప్రదించాడు ఆ కారు ఓనర్. మరి అతడు ఆ చలానాను కట్టాడా.. లేదా తెలుసుకోవాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.