ఉత్తర్‌ప్రదేశ్‌లో అక్రమంగా పదోన్నతులు పొందిన వారిపై కొరడా ఝుళిపించింది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. నలుగురు జిల్లా అదనపు సమాచార అధికారుల స్థాయిల్ని.. ప్యూన్, వాచ్మెన్ల హోదాకు తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఏం జరిగిందంటే.?
యూపీ ప్రభుత్వ సమాచార, ప్రజా సంబంధాల శాఖ జారీచేసిన నోటిఫికేషన్ ప్రకారం.. నలుగురు వ్యక్తులు జిల్లా అదనపు సమాచార అధికారులుగా 2014 నవంబర్ 3న పదోన్నతి పొందారు. బరేలీ, ఫిరోజాబాద్, మధుర, భదోహీ(సంత్ రవిదాస్ నగర్)లో పనిచేస్తున్న వారు.. అక్రమంగా పదోన్నతి పొందినట్టు ఇటీవల తేలింది. ఈ వ్యవహారంపై హైకోర్టులో కేసు నమోదైంది. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. వారి హోదాల్ని పూర్వస్థాయికి పరిమితం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
గతంలోనూ..
అంతకుముందు.. జిల్లా డిప్యూటీ మేజిస్ట్రేట్ విషయంలోనూ ఇదే జరగ్గా.. ఆ హోదాను తహసీల్దార్‌కు పరిమితం చేసింది ప్రభుత్వం.
రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కేసుల్లో.. గత మూడేళ్లలోనే సుమారు 2,100 మందికిపైగా జైలుకు వెళ్లేలా చేసింది యోగి సర్కార్. ఈ తరహా మోసాలకు పాల్పడిన 480 మంది పోలీసు ఉద్యోగులపైనా చర్యలు తీసుకుంది.
ఇదీ చదవండి: తొలిసారి ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక గుర్తింపు కార్డులు