UP election third phase: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రధానంగా అధికార భాజపా, విపక్ష సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కూటమి మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది. ఐదేళ్ల క్రితం పశ్చిమ యూపీలో చతికిలపడ్డ ఎస్పీ.. ఈ దఫా తొలి రెండు విడతల్లో అక్కడ రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డీ) సహకారంతో గణనీయ సంఖ్యలో ఓట్లను పెంచుకున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం అందరి దృష్టి తదుపరి విడత పైకి మళ్లింది. రాష్ట్రంలో పశ్చిమాన ఉన్న స్థానాలతో మొదలైన పోలింగ్.. క్రమంగా తూర్పు యూపీ వైపు వెళ్తోంది. చివరి మూడు దశల్లో ఓటర్ల అండ కమలనాథులకు ఎక్కువగా లభించే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తొలి రెండు విడతల్లో మెరుగైన స్థితిలో నిలిచినట్లు కనిపిస్తున్న అఖిలేశ్ పార్టీకి.. 3, 4 దశల్లో ఆధిపత్యం ప్రదర్శించడం అత్యంత కీలకమని చెబుతున్నారు. మూడో దశలో పోలింగ్ జరగనున్న నియోజకవర్గాల్లో యాదవ్‌ల ప్రాబల్యం ఎక్కువగా ఉండటం, యాదవ్‌ల బెల్ట్‌గా పరిగణించే 8 జిల్లాలకు ఈ విడతలోనే పోలింగ్ జరగనుండటం ఎస్పీకి సానుకూలాంశాలు.
![akhilesh yadav up election](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14508051_gh-politics3c_3-3.jpg)
Yadav belt UP election
ఐదేళ్ల క్రితం చేదు ఫలితాలు
యూపీలో 16 జిల్లాల్లో విస్తరించి ఉన్న 59 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడోదశ పోలింగ్ జరగనుంది. వీటిలోని 8 జిల్లాల్లో యాదవ్‌ల ప్రాబల్యం ఎక్కువ. అవి- మైన్‌పురీ, ఇటావా, ఫిరోజాబాద్, ఎటా, కాస్‌గంజ్, కన్నౌజ్, ఔరైయా, ఫరూఖాబాద్. ఈ జిల్లాలను యాదవ్ సామాజిక వర్గ బెల్ట్‌గా పరిగణిస్తుంటారు. ఈ బెల్ట్‌లో 29 శాసనసభ స్థానాలున్నాయి. వాటిలో దీర్ఘకాలంపాటు ఎస్పీ హవా నడిచింది. 2012 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో 25 సీట్లు ఆ పార్టీ ఖాతాలోకే వెళ్లాయి. నాడు భాజపా ఇక్కడ ఒకే ఒక్క నియోజకవర్గంలో గెలుపొందింది. 2017 ఎన్నికల్లో మాత్రం ఎస్పీకి ఇక్కడ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కేవలం 6 స్థానాలకు పరిమితమైంది. మిగిలిన 23 చోట్ల కమలనాథులు జయభేరి మోగించారు.
![up election third phase](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14508051_gh-politics3c_3-2.jpg)
అఖిలేశ్ స్వయంగా బరిలో దిగి..
UP election Akhilesh Yadav
భాజపాను గద్దె దింపి మళ్లీ సీఎం పీఠమెక్కేందుకు ప్రయత్నిస్తున్న అఖిలేశ్.. ఈ దఫా మూడో దశపైనే భారీగా ఆశలు పెట్టుకున్నారు. మైన్‌పురీ జిల్లాలో ఎస్పీకి పెట్టని కోట వంటి కర్హల్ స్థానం నుంచి ఆయన స్వయంగా ఎన్నికల బరిలో దిగారు. దీంతో ఈ ప్రాంత వ్యాప్తంగా ఎస్పీకి సానుకూల ప్రభావం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాబాయ్ శివపాల్‌సింగ్ యాదవ్, అఖిలేశ్ మధ్య తలెత్తిన విభేదాలు.. గత ఎన్నికల్లో యాదవ్ ఓటర్ల మధ్య చీలికకు కారణమయ్యాయి. ఇప్పుడు వారిద్దరూ ఒక్కటవడంతో.. ఓట్లు ఎస్పీకి అనుకూలంగా సంఘటితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూపీలో జాట్‌లతో పాటు యాదవ్‌లూ ఎన్నికల వేళ అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తుంటారు. ఈ రెండు సామాజికవర్గాల వారు క్షేత్రస్థాయిలో ఇతర వర్గాల ఓటర్లనూ ప్రభావితం చేస్తుంటారు. అందుకే ఈ సామాజిక వర్గాల మద్దతు కోసం రాజకీయ పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తుంటాయి. ఈ దఫా యాదవ్‌లు తమకు అండగా నిలుస్తారని ఎస్పీ ధీమా వ్యక్తం చేస్తోంది.
![up election third phase](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14508051_gh-politics3c_3-1.jpg)
సంక్షేమ పథకాలపై భాజపా ధీమా
UP election BJP Yadav Belt: మరోవైపు- యాదవ్ బెల్ట్‌లో గత ఎన్నికల నాటి ఫలితాలను పునరావృతం చేయాలని భాజపా బలంగా కోరుకుంటోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్ మౌర్య వంటి నేతలు ఈ ప్రాంతంలో ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. ఇంటింటి ప్రచారంలో కమలనాథులు ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. కర్హల్‌లో వ్యూహాత్మకంగా అఖిలేశ్‌కు పోటీగా కేంద్ర మంత్రి సత్యపాల్‌సింగ్ బఘేల్‌ను భాజపా బరిలో దించింది. ప్రధానంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు మూడో విడతలో తమకు కలిసొస్తాయని కమలనాథులు ఆశిస్తున్నారు.
ఎస్పీకి కంచుకోటగా పేరున్న మరో స్థానం జశ్వంత్‌నగర్ (ఇటావా జిల్లా) నుంచి శివపాల్‌సింగ్ యాదవ్ ప్రస్తుతం బరిలో ఉన్నారు. ఇక్కడ అఖిలేశ్ తండ్రి ములాయంసింగ్ యాదవ్ వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. శివపాల్ 1996 నుంచి 2017 వరకు వరుసగా ఐదుసార్లు గెలిచారు.
ఇదీ చదవండి: 'బుల్డోజర్లు రిపేర్‌లో ఉన్నాయ్.. ఫలితాల తర్వాత వారి పని పడతాయ్!'