UP Election 2022: ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం అన్నట్లు ఉంది. అభ్యర్థుల ప్రమాణ పత్రాల్లో విస్తుపోయే నేరాలు-ఘోరాలు కళ్లకు కట్టాయి.
యూపీ తొలిదశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 615 మందిలో దాదాపు 25 శాతం మంది నేర చరితులే. అంటే 156 మంది అభ్యర్థులు పలు కేసుల్లో నిందితులు. ఇందులో 121 మందిపై అత్యాచారం, కిడ్నాపులు, హత్యలు లాంటి తీవ్రమైన నేరాభియోగాలున్నాయి. ఈ నివేదికను బుధవారం అసోషియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ విడుదల చేసింది.
పోటీలో ఉన్న 623 మంది అభ్యర్థుల్లో 615 మంది ప్రమాణపత్రాలను ఈ సంస్థ నిశితంగా విశ్లేషించింది. మిగిలిన 8 మందివి సరిగా స్కాన్ కాకపోవడంవల్ల వాటిని పరిశీలించలేకపోయినట్లు పేర్కొంది.
ఒకరిని మించి ఒకరు..
ఈ నివేదిక ప్రకారం.. నేరస్థులకు టికెట్లిచ్చిన ప్రముఖ పార్టీల్లో ఎస్పీ, భాజపా, ఆర్‌ఎల్‌డీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఆప్‌లు వరుస స్థానాల్లో ఉన్నాయి ఇందులో 12 మందికి మహిళలపై నేరాలకు పాల్పడిన చరిత్ర ఉంది. ఒక అభ్యర్థిపై అత్యాచారానికి సంబంధించిన కేసు నమోదైంది. ఆరుగురు అభ్యర్థులపై హత్య, 30 మందిపై హత్యాయత్నం కేసులు ఉన్నాయి. తొలిదశ ఎన్నికలు జరిగే 58 నియోజకవర్గాల్లో 31 (53శాతం) నియోజకవర్గాలు రెడ్ అలర్ట్‌లో ఉన్నాయి. వాటిలో ముగ్గురు అంతకుమించిన అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.
![UP Election 2022](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14357672_hsy.jpg)
కోటీశ్వరులు 280 మంది..
అభ్యర్థుల ఆస్తులు పరిశీలిస్తే.. కోటీశ్వరులు 280 మంది (46శాతం) తేలారు. ఇందులో 104 మందికి 5 కోట్లకు మించి ఆస్తులున్నాయి. కోటీశ్వరుల్లో అత్యధికమంది ఆర్‌ఎల్‌డీ (97శాతం), భాజపా (97శాతం), బీఎస్పీ (89శాతం), ఎస్పీ (82శాతం), కాంగ్రెస్ (55శాతం), ఆప్ (42శాతం)నుంచి ఉన్నారు.
తొలిదశలో రంగంలోకి దిగిన అభ్యర్థుల సగటు ఆస్తి విలువ రూ.3.72 కోట్లు. పార్టీలవారీగా చూస్తే ఎస్పీ అభ్యర్థుల సగటు ఆస్తి రూ.13.23 కోట్లు, భాజపా రూ.12.01 కోట్లు, ఆర్‌ఎల్‌డీ రూ.8.32 కోట్లు, బీఎస్పీ రూ.7.71 కోట్లు, కాంగ్రెస్ రూ.3.08 కోట్లు, ఆప్ రూ.1.23 కోట్లు ఉన్నట్లు తెలిపింది.
మేరఠ్ కంటోన్‌మెంట్ నుంచి భాజపా నుంచి పోటీచేస్తున్న అమిత్ అగర్వాల్ ఆస్తి విలువ అత్యధికంగా రూ.148 కోట్లు. తర్వాతి స్థానంలో మథుర బీఎస్పీ అభ్యర్థి ఎస్‌కేశర్మ (రూ.112 కోట్లు) ఉన్నారు.
"యూపీలో పోటీ చేస్తున్న అన్ని ప్రముఖ రాజకీయ పార్టీలు 15 నుంచి 75 శాతం మంది నేరస్థులకు టికెట్లిచ్చాయి. తమపై నేరాభియోగాలు ఉన్నట్లు వారే తమ ప్రమాణపత్రాల్లో అంగీకరించారు. దీన్ని బట్టి ఎన్నికల సంస్కరణలపై మన రాజకీయ పార్టీలకు ఏమాత్రం ఆసక్తి లేదని స్పష్టమవుతోంది. చట్టాన్ని ఉల్లంఘించే వారే చట్టాన్ని తయారుచేస్తూ మన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు"
- ఏడీఆర్ నివేదిక
మరోవైపు ఆగ్రాజిల్లాలోని ఎట్మాద్‌పుర్ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేస్తున్న శివ్ చరణ్‌లాల్‌కు రూ.వెయ్యి చరాస్తి తప్ప ఇంకేమీ లేవని తెలిపింది. అప్పుల్లో మేరఠ్ కంటోన్‌మెంట్ భాజపా అభ్యర్థి అమిత్ అగర్వాల్ (రూ.13 కోట్లు), ఛాప్రౌలీ భాజపా అభ్యర్థి షహేందర్‌సింగ్ రమల(రూ.11 కోట్లు), మథుర బీఎస్పీ అభ్యర్థి ఎస్‌కేశర్మ (రూ.9కోట్లు) తొలి మూడుస్థానాల్లో నిలిచినట్లు వెల్లడించింది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇవీ చూడండి: 'ఐదేళ్ల క్రితం యూపీలో గూండాల రాజ్యం.. ఇప్పుడు మాత్రం...'
'30 ఏళ్ల తర్వాత అన్ని స్థానాల్లో పోటీ.. జైలుకు వెళ్లేందుకైనా సిద్ధం'
UP election 2022: 'భాజపా అధికారంలోకి వస్తే.. ఉచితంగా 'డబుల్ రేషన్''