అఫ్గానిస్థాన్ పరిస్థితులు ప్రపంచానికి అనుగుణంగా మార్చుకునేందుకు ఏకీకృత స్పందన అవసరం ఉందని అంతర్జాతీయ సంఘానికి పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రాంతీయ, అంతర్జాతీయ ఉగ్రవాదానికి అఫ్గాన్ భూభాగం సహకరించకూడదని పునరుద్ఘాటించారు.
వర్చువల్‌గా జరిగిన జీ20 సదస్సులో పాల్గొన్న మోదీ.. అఫ్గాన్ ప్రజలకు అందాల్సిన మానవతా సహాయంలో ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని తెలిపారు. అఫ్గాన్ ప్రభుత్వంలో మహిళలు, మైనారిటీలకు స్థానం ఉండాలని మోదీ అభిప్రాయపడ్డారు. 20ఏళ్లుగా ఆ దేశం సాధించిన సామాజిక- ఆర్థిక లాభాలకు ఇది అత్యావశ్యకమన్నారు.
"అఫ్గాన్‌పై జరిగిన జీ20 సదస్సులో పాల్గొన్నాను. ఉగ్రవాదానికి అఫ్గాన్ భూభాగం కేంద్రబిందువు కాకూడదన్న విషయాన్ని ప్రస్థావించాను. అఫ్గాన్ ప్రజలకు అందాల్సిన మానవతా సహాయంలో ఆటంకాలు ఉండకూడదని స్పష్టం చేశాను. అఫ్గాన్ పరిస్థితులను మెరుగుపరిచేందుకు యూఎన్ఎస్సీ తీర్మానం 2593 ప్రకారం ఏకీకృత అంతర్జాతీయ స్పందన అవసరం ఉంది."
-- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
ఇటలీ అధ్యక్షతన ఈ సదస్సు జరిగింది. ఇందులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా పాల్గొన్నారు. అఫ్గాన్‌లో ఉగ్రవాద నిరోధక చర్యలు మరింత కట్టుదిట్టంగా జరగాలని సదస్సులో పాల్గొన్న దేశాలు అభిప్రాయపడ్డాయి. అదే సమయంలోా అఫ్గాన్‌లో చిక్కుకున్న విదేశీయులను సురక్షితంగా రక్షించి బయటకు తీసుకురావాలని అంగీకరించారు.
"ఐసిస్-కేను అడ్డుకోవడం సహా ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలపై ఎక్కువ దృష్టిసారించాల్సిన అవసరం ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. అఫ్గాన్‌ను వీడాలనుకుంటున్న విదేశీయులకు తగిన డాక్యుమెంట్లను అందించాలని అంగీకరించారు. మహిళలు, పిల్లలు, మైనారిటీలతో పాటు అఫ్గాన్ ప్రజలకు స్వతంత్ర అంతర్జాతీయ సంస్థల ద్వారా మానవతా సహాయాన్ని అందించేందుకు కట్టుబడి ఉన్నట్టు నేతలు ఉద్ఘాటించారు."
-- శ్వేతసౌధం ప్రకటన.
ఆగస్టు నెలలో, అమెరికా దళాలు వెనుదిరుగుతున్న సమయంలో, మెరుపువేగంతో అఫ్గాన్‌ను ఆక్రమించుకున్నారు తాలిబన్లు. ఫలితంగా ఆ దేశంలో సంక్షోభంలోకి జారుకుంది. అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు తాలిబన్లు.
ఇదీ చూడండి:- పోలీసులుగా మారిన తాలిబన్లు- వీధుల్లో తుపాకులతో పహారా