ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్ జిల్లాలో అరుదైన వివాహం జరిగింది. పది మంది పిల్లలకు తల్లి అయిన ఓ వితంతువు.. తన ప్రియుడిని పెళ్లి చేసుకుంది. గ్రామస్థులు, పెద్దల సమక్షంలో ఆలయంలో ఏడడుగులు వేసింది. అంతే కాకుండా.. గ్రామానికి చెందిన ఓ పీజీ కళాశాల ప్రిన్సిపల్.. వారిద్దరికీ ఉద్యోగాలు కూడా కల్పించారు. పది మంది పిల్లలకు అండగా నిలిచారు!
స్థానికుల సమాచారం ప్రకారం.. జిల్లాలోని బహల్‌గంజ్ ప్రాంతానికి చెందిన సోనీ శర్మ(42).. మొదటి భర్త ఆరేళ్ల క్రితం మృతి చెందాడు. అప్పటికే ఆమెకు పది మంది పిల్లలు ఉన్నారు. భర్త చనిపోయాక సోనీ శర్మ.. అదే గ్రామానికి చెందిన బాలేంద్ర(40) అనే వ్యక్తితో ప్రేమలో పడింది. కానీ అతడిని వివాహం చేసుకోలేదు. ఏడాది క్రితం గ్రామం నుంచి వీరు పరారై వేరే చోట నివాసముంటున్నారు. అయితే అప్పుడప్పుడు.. సోనీ శర్మ గ్రామానికి వచ్చేది. ఆ సమయంలో స్థానికులు.. పిల్లల బాగోగులు అడిగి తెలుసుకునేవారు. బాలేంద్ర, సోనీ ప్రేమ విషయం గ్రామంలో అందరికీ తెలుసు. దీంతో వారిద్దరికి పెళ్లి చేసి.. ఆ పది మంది పిల్లలకు కొత్త జీవితం ప్రసాదించాలని నిర్ణయించుకున్నారు.
తాజాగా అదే గ్రామానికి చెందిన గురుకుల పీజీ కళాశాల ప్రిన్సిపల్ జై ప్రకాశ్ షాహీ.. సోనీశర్మ, బాలేంద్రను గ్రామానికి పిలిచి పంచాయతీ పెట్టారు. ఇద్దరినీ ఒప్పించిన అనంతరం గ్రామంలో ఉన్న శివాలయంలో వివాహం జరిపించారు. గ్రామస్థుల సమక్షంలో సోనీ, బాలేంద్ర పూల దండలు మార్చుకున్నారు. అందరి సమక్షంలో ఒక్కటయ్యారు. సోనీ శర్మ పది మంది పిల్లలకు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదని పీజీ కళాశాల ప్రిన్సిపల్ జైప్రకాశ్ తెలిపారు. బాలేంద్ర, సోనీ శర్మకు తమ కాలేజీలో ఉద్యోగాలు ఇప్పిస్తున్నట్లు చెప్పారు. దంపతులు కలిసి ఉండేందుకు ఉచితంగా వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు.
చనిపోయిన వ్యక్తిని పెళ్లాడిన వితంతువు!
కొన్ని నెలల క్రితం.. ఒడిశాలో ఓ వింత వివాహం జరిగింది. చనిపోయిన వ్యక్తిని పెళ్లాడింది ఓ వితంతువు. కుటుంబ సభ్యుల మధ్య సంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకుంది. ఘాసీ అమనాత్య అనే వ్యక్తి కొరాపుట్ జిల్లాలోని పొడపాడర్ గ్రామంలో నివసించేవాడు. అతడికి కొన్నేళ్ల క్రితం సుబర్న అనే మహిళతో వివాహం జరిగింది. రెండు సంవత్సరాల కింద కొందరు గ్రామస్థులతో కలిసి ఉపాధి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లాడు ఘాసీ. అయితే, అతడు మార్గమధ్యంలోనే తప్పిపోయాడు. అతడి స్నేహితులు ఎంత వెతికినా జాడ దొరకలేదు. దీంతో ఎనిమిది నెలల తర్వాత ఘాసీ మరణించాడని.. అతడి కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
ఘాసీ మరణించాడని తెలిసిన బంధువులు, కుటుంబ సభ్యులు అతడికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అప్పటి నుంచి అతడి భార్య సువర్ణ వితంతువుగా జీవిస్తోంది. కానీ రెండు నెలల క్రితం ఘాసీ ఇంటికి రావడం వల్ల కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. తప్పిపోయి తిరిగి వచ్చిన విషయాన్ని గ్రామస్థులకు వివరించాడు ఘాసీ. సువర్ణ వితంతువుగా మారినందున.. ఆమెను తిరిగి సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోవాలని గ్రామపెద్దలు సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థుల సమక్షంలో శివాలయంలో దంపతులు మళ్లీ పెళ్లి చేసుకున్నారు.