కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ కారు ప్రమాదానికి గురైంది. కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలోని అంకోలాలో ఈ ఘటన జరిగింది.
ఈ ప్రమాదంలో ఆయన భార్య విజయతో పాటు వ్యక్తిగత సహాయకుడు దీపక్ ప్రాణాలు కోల్పోయారు. మంత్రి శ్రీపాద్ నాయక్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ను గోవాలోని బంబోలి ఆస్పత్రికి తరలించారు. యల్లాపుర్ నుంచి గోకర్నకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
కాగా, ఈ విషయంపై ప్రధాని మోదీ స్పందించారు. మంత్రికి అత్యుత్తమ వైద్యం అందేలా చూడాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌కు సూచించారు. మంత్రి వైద్యానికి మెరుగైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం సావంత్‌తో మాట్లాడారు. అవసరమైతే మంత్రిని దిల్లీకి తీసుకురావాలని సూచించారు. అదేసమయంలో, మంత్రి చికిత్స పొందుతున్న ఆస్పత్రికి సావంత్ చేరుకున్నారు.
మరోవైపు, శ్రీపాద్ సతీమణి మృతి పట్ల కర్ణాటక సీఎం యడియూరప్ప సంతాపం వ్యక్తం చేశారు.