Union Cabinet Meeting : చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే మహిళా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ డిమాండ్‌ను మోదీ ప్రభుత్వం నెరవేరుస్తుందని.. ఈ డిమాండ్‌ను నెరవేర్చే ధైర్యం మోదీ ప్రభుత్వానికే ఉందని చెప్పారు. ఈ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలపడం వల్ల ఇది రుజువైందని అన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించిన మోదీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ భేటీలో అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, స్మృతీ ఇరానీ, జైశంకర్, పీయూష్ గోయల్, గడ్కరీ, తోమర్, పాల్గొన్నారు. అయితే కేబినెట్ సమావేశానికంటే ముందు పలువురు మంత్రులు కీలక భేటీలు నిర్వహించారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ భేటీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నట్లు సమాచారం. అనంతరం ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు జమిలి ఎన్నికలు, దేశం పేరును మార్చే బిల్లును కూడా తీసుకువస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఇక ప్రస్తుతం జరుగుతోన్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిడివి తక్కువే అయినప్పటికీ.. జరుగుతున్న సందర్భం చాలా గొప్పదని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Modi Parliament Speech Today : అంతకుముందు సోమవారం ఉదయం లోక్‌సభ ప్రత్యేక సమావేశాల ప్రారంభం సందర్భంగా పార్లమెంటు 75ఏళ్ల ప్రస్థానంపై సోమవారం ప్రధాని మోదీ చర్చను ప్రారంభించారు. భారత్ సువర్ణాధ్యాయానికి సాక్షిగా నిలిచిన పార్లమెంట్ పాత భవనంలో.. 75 ఏళ్లపాటు జరిగిన చర్చలు, ప్రణాళికలు భారత గతిని మార్చాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ఈ భవనం వేదికైందని గుర్తు చేశారు. నెహ్రూ నుంచి వాజపేయీ, మన్మోహన్‌సింగ్ వరకు ఈ సభకు నేతృత్వం వహించారని గుర్తు చేసిన ప్రధాని.. వారి సేవలను కొనియాడారు. దీంతో పాటు మన్మోహన్ సింగ్ హయాంలో జరిగిన నోటుకు ఓటు కుంభకోణాన్ని ప్రధాని గుర్తు చేశారు. అనేకమంది ఉద్ధండులు ఈ సభలో ప్రజా ప్రయోజనాల ఉపన్యాసాలు వెలువరించారన్నారు. చర్చల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఎన్ని ఉన్నా ప్రజా ప్రయోజనాలే పరమావధిగా నిలిచాయని తెలిపారు. లోక్‌సభ ప్రత్యేక సమావేశాల ప్రారంభం సందర్భంగా పార్లమెంటు 75ఏళ్ల ప్రస్థానంపై సోమవారం ప్రధాని మోదీ చర్చను ప్రారంభించారు.
Parliament Special Session 2023 Modi : ప్రత్యేక సమావేశాల్లో చారిత్రక నిర్ణయాలు: మోదీ