2024 లోక్సభ ఎన్నికల్లో విజయమే అంతిమ లక్ష్యంగా విపక్షాలన్నీ పని చేయాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పిలుపునిచ్చారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో స్వాతంత్ర్య ఉద్యమం, రాజ్యాంగ విలువలపై నమ్మకం ఉంచే ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రణాళికాబద్ధంగా పని చేయాలని ఈ సందర్భంగా సోనియా సూచించారు. విపక్ష పార్టీలపై ఒత్తిళ్లు ఉన్నా.. దేశ ప్రయోజనాల రీత్యా వాటన్నింటికీ అతీతంగా పని చేయాలని కోరారు. సమష్టిగా పని చేయాలన్న సంకల్పాన్ని 75వ స్వాతంత్ర్య దినోత్సవ సంవత్సరం మరోసారి గుర్తు చేస్తోందన్నారు సోనియా.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పెగసస్ వ్యవహారంపై చర్చించడానికి కేంద్రం సిద్ధంగా లేకపోవడం వల్ల సమావేశాలు వృథాగా ముగిశాయి. సభలో ప్రతిపక్షాలు అన్నీ ఒక తాటి మీదకు రావాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వ్యవహారాలపై పెద్ద ఎత్తున చర్చ జరగాలి. బంగాల్, మహారాష్ట్ర లాంటి భాజపాయేతర పాలిత రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తోంది. కరోనా సమయంలో జీవనోపాధి దెబ్బతిన్న వారికి ప్రత్యక్ష నగదు బదిలీ వంటి అత్యవసర చర్యల ఆవశ్యకతను వివరిస్తూ.. కాంగ్రెస్ పార్టీ తరపున ఇప్పటికే పలుసార్లు ప్రధానమంత్రికి లేఖ రాశాం.
-సోనియా గాంధీ, కాంగ్రెస్ అధినేత్రి
మన మధ్యన ఉన్న అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి 2024 ఎన్నికల్లో భాజపాను ఓడించడమే లక్ష్యంగా కలిసి పని చేయాలి.
-మమత బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి
ఈ సమావేశానికి నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, తమిళనాడు సీఎం స్టాలిన్, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఎల్జేడీ అధ్యక్షుడు శరద్ యాదవ్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొన్నారు. అయితే సమాజ్వాదీ పార్టీ నుంచి నాయకులు ఎవరూ హాజరుకాలేదు.
సంయుక్తంగా ప్రతిపక్షాల నిరసనలు...
భాజపాకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు దేశవ్యాప్తం నిరసనలకు సిద్ధమవుతున్నాయి. విపక్షాలు అన్నీ కలిసి మెరుగైన భారత్ కోసం సెప్టెంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు సంయుక్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు సోనియా గాంధీ అధ్యక్షత సమావేశమైన 19 రాజకీయ పార్టీల నేతలు సంయుక్త ప్రకటనను విడుల చేశారు.
'ప్రజలు మిమ్మన్ని తిరస్కరించారు...'
2024 ఎన్నికల్లో భాజపా పతనమే లక్ష్యంగా విపక్షనేతల వర్చువల్ భేటిపై కమలం నాయకులు విమర్శలు గుప్పించారు. ప్రజలు కాంగ్రెస్ను ఎప్పుడు తిరస్కరించినట్లు పేర్కొన్నారు. అందుకే ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు పరాజయాన్ని చవిచూసినట్లు ఆరోపించారు. దేశాభివృద్ధి కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రజలు విశ్వాసిస్తున్నారని ఆ పార్టీ అధికార అనిల్ బలూని అన్నారు.
ఇదీ చూడండి: తాలిబన్లను ఉద్దేశించి మోదీ కీలక వ్యాఖ్యలు!