Ukraine Russia War: తాను ప్రేమగా పెంచుకుంటున్న శునకం కోసం ఉక్రెయిన్పై రష్యా జరుపుతున్న భీకర దాడుల మధ్యే ఉండిపోయిన భారత విద్యార్థి రిషభ్ కౌశిక్.. ఎట్టకేలకు తన పెంపుడు కుక్కతో భారత్ చేరుకున్నాడు. దేహ్రాదూన్కు చెందిన రిషభ్ .. ఆపరేషన్ గంగలో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున బుడాపెస్ట్ నుంచి ప్రత్యేక విమానంలో స్వదేశానికి వచ్చాడు.
"ఇక్కడికి వచ్చేందుకు చాలా ప్రొసీజర్ ఉంది. ఇలాంటి అత్యవసర సమయాల్లో తమ దేశస్థులను వెంటనే అనుమతించాల్సింది. పెంపుడు జంతువులను కూడా ఎలాంటి ఎన్ఓసీ లేకుండానే భారత్కు అనుమతిస్తున్నట్లు తెలిసింది."
-రిషభ్ కౌశిక్, విద్యార్థి
కొద్ది రోజుల క్రితం కౌశిక్.. ఇన్స్టాలో ఓ వీడియో షేర్ చేశాడు. తన పెంపుడు కుక్కను తీసుకువచ్చేందుకు అధికారులను అనుమతి కోరగా జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన కుక్కను వెంట తెచ్చుకునేందుకు అనుమతించే వరకు ఉక్రెయిన్లోనే ఉంటానని పేర్కొన్నాడు.
అయితే ఇటీవల కేంద్రం పెంపుడు జంతువులను కూడా తమ వెంట తీసుకువచ్చేందుకు విద్యార్థులకు అనుమతించింది. దీంతో ఉక్రెయిన్ నుంచి భారత్ చేరుకున్న విద్యార్థులతో పాటు పెంపుడు పిల్లులు, కుక్కలు దర్శనమిచ్చాయి. ఎలాంటి ఆంక్షలు లేకపోవడం వల్ల చాలా మంది తమ పెంపుడు శునకాలను, పిల్లులను వెంట తెచ్చుకున్నారు.
ఉక్రెయిన్ నుంచి వస్తున్న భారతీయులకు కేంద్ర మంత్రులు స్వాగతం పలుకుతున్నారు. శుక్రవారం.. కేంద్ర మంత్రి నిషిత్ ప్రామాణిక్ హంగేరీ నుంచి వచ్చిన 219 మంది విద్యార్థులకు దిల్లీలో స్వాగతం పలికారు. మరో రెండు రోజుల్లో 7,400 మంది భారత్ చేరుకోనున్నట్లు కేంద్రం వెల్లడించింది. శుక్రవారం 3500 మందిని, శనివారం మరో 3900 మందిని స్వదేశానికి తీసుకువస్తున్నట్లు తెలిపింది.
ఇదీ చూడండి : సుమీలో 700 మంది భారత విద్యార్థులు- 7 రోజులుగా బిక్కుబిక్కుమంటూ..