Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో అక్కడ చదువుకుంటున్న వేలాది మంది విద్యార్థులు భయభ్రాంతుల నడుమ స్వదేశానికి చేరుకున్నారు. వారిలో అనేక మంది వైద్య విద్యార్థులే ఉన్నారు. అయితే ప్రస్తుతం వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఆన్‌లైన్ తరగతులు కొనసాగుతున్నప్పటికీ పూర్తిస్థాయిలో జరగడంలేదు. ఈ నేపథ్యంలోనే సాయమందించాలంటూ వారు కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇక్కడి కళాశాలల్లో తాము చదువుకునేలా చూడాలని కోరుతున్నారు.
విన్నిట్సియా నేషనల్ పిరోగోవ్ మెడికల్ యూనివర్శిటీలో చదువుతూ భారత్‌కు తిరిగొచ్చిన ప్రతిక్ష శర్మ ఓ మీడియా సంస్థతో మాట్లాడారు.
"ఉక్రెయిన్‌లో పరిస్థితులు చూసిన తర్వాత మళ్లీ అక్కడికి వెళ్లాలని లేదు. కేంద్ర ప్రభుత్వమే మాకు ఓ దారి చూపుతుందని ఆశిస్తున్నాం. నేను ఫిబ్రవరి 24వ తేదీనే భారత్‌కు రావాల్సి ఉంది. కానీ దాడులు తీవ్రతరం కావడంతో కీవ్‌లోని ఓ బంకర్‌లో మూడు రోజులపాటు ఉండాల్సి వచ్చింది. తర్వాత అక్కడి నుంచి హంగరీ సరిహద్దులకు వెళ్లా. అనంతరం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో భారత్‌కు చేరుకున్నా."
- ప్రతిక్ష శర్మ, విద్యార్థిని
తన చదువు గురించి మాట్లాడుతూ.. 'ప్రస్తుతం ఆన్‌లైన్ క్లాసులు జరుగుతున్నాయి. కానీ మెడిసిన్ అనేది ప్రాక్టికల్ తరగతులతో కూడుకున్న చదువు. ప్రాక్టికల్స్ లేకుండా ఆన్‌లైన్ తరగతులు వినడంలో అర్థంలేదు. ప్రత్యక్ష అనుభవాలు ఎంతో అవసరం. అవి లేకుండా పట్టా పొందినా.. తర్వాత సమస్యలు ఏర్పడవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇక్కడి కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తే భారత్‌లోనే చదువుకుంటా. ఒకవేళ వీలుకాదని చెప్తే ఇక చేసేదేంలేదు. ఉక్రెయిన్‌లో 'క్రోక్' (KROK) పరీక్ష క్లియర్ చేసి.. చదువు పూర్తిచేసేందుకు మరే దేశానికైనా వెళ్తా' అని ప్రతిక్ష వాపోయింది. డాక్టర్ లేదా ఫార్మసిస్ట్ ధ్రువీకరణ పొందేందుకు క్రాక్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి.
ఇదీ చూడండి: విద్యార్థిపై ఉపాధ్యాయుడి క్రూరత్వం.. చావుదెబ్బలు కొట్టి ఆపై...