బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంభాషించారు. కరోనా వ్యాక్సిన్, వాతావరణ మార్పులు, వాణిజ్యం సహా పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ విషయాలపై చర్చించారు.
భారత్-బ్రిటన్ సంబంధాలకు 2021 ఏడాది కీలకమని బోరిస్ పేర్కొన్నట్లు డౌనింగ్ స్ట్రీట్(బ్రిటన్ ప్రధాని కార్యాలయం) పేర్కొంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో సుస్థిరతకు బ్రిటన్ కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. వచ్చే ఏడాది ఈ ప్రాంతంలో హెచ్ఎం క్వీన్ ఎలిజబెత్ క్యారియర్ బృందాన్ని మోహరించేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.
"బోరిస్ జాన్సన్, ప్రధాని మోదీ కలిసి కరోనా వ్యాక్సిన్ విషయాలపై చర్చించారు. ఇరుదేశాల శాస్త్రవేత్తలు సంయుక్తంగా పనిచేయడాన్ని స్వాగతించారు. వాతావరణ మార్పులకు తోడ్పడే 'వాతావరణ ఆశయ శిఖరాగ్ర సమావేశం'లో పాల్గొనేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక సంబంధాల బలోపేతం కోసం మరింత కృషి చేయాలని దేశాధినేతలు నిర్ణయించారు."
-డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయ ప్రతినిధి
బోరిస్‌తో సంభాషణ అద్భుతంగా సాగిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బోరిస్‌ను స్నేహితుడిగా అభివర్ణించిన మోదీ.. వచ్చే దశాబ్దంలో భారత్-బ్రిటన్ మధ్య సంబంధాల కోసం ప్రతిష్ఠాత్మక రోడ్‌మ్యాప్‌ను బోరిస్ సిద్ధం చేశారని చెప్పారు. కరోనా పోరుతో పాటు వాతావరణ మార్పులు, రక్షణ, వాణిజ్య రంగాల్లో సహకారం పెంపొందించుకోవాలని అంగీకరించుకున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి- మోదీ హయాంలో ఆర్థిక మాంద్యంలోకి భారత్: రాహుల్