Udaipur Tailor Killing: ఉదయ్‌పుర్‌లో దర్జీ కన్హయ్యలాల్‌ను దారుణంగా హత్య చేసిన నిందితులు గౌస్ మహమ్మద్, మహమ్మద్ రియాజ్‌ను ఇద్దరు గ్రామస్థులు తెలివిగా వెంటాడి పోలీసులకు పట్టించారు. ప్రస్తుతం వీరు ఆ ప్రాంతంలో హీరోలుగా మారారు. వీరిని సోమవారం.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కలిశారు. వీరిపేర్లు శక్తి సింగ్, ప్రహ్లాద్ సింగ్. వీరిది రాజ్‌సమండ్ జిల్లాలోని తాల్ గ్రామం.
ఉదయ్‌పుర్‌లో దర్జీ కన్హయ్యలాల్‌ను హత్య చేసిన తర్వాత నిందితులు బైక్‌పై పారిపోయారు. దీంతో తాల్ గ్రామంలోని శక్తిసింగ్, ప్రహ్లాద్ సింగ్‌కు ఓ పోలీస్ మిత్రుడు ఫోన్ చేసి అటువైపుగా వస్తున్న నిందితులను అనుసరించాలని కోరాడు. ఈ క్రమంలో శక్తి, ప్రహ్లాద్‌కు స్థానిక బస్టాండ్ వద్ద నిందితులు కనిపించారు. వెంటనే వారిద్దరూ పోలీసులను అప్రమత్తం చేసి, నిందితులను 30 కిలోమీటర్ల వరకు వెంబడించారు. వీరి ప్రయాణ మార్గం మొత్తంలో పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తూనే ఉన్నారు. ఒక దశలో హంతకులు గౌస్ మహమ్మద్, మహమ్మద్ రియాజ్ వీరిని తమ వద్ద కత్తులతో భయపెట్టేందుకు ప్రయత్నించారు కూడా. ఎట్టకేలకు పోలీసులు నిందితులిద్దరినీ అరెస్టు చేశారు.
''ఉదయ్‌పుర్ ఘటనలో ఇద్దరు నిందితులు బైక్‌పై దేవగఢ్ వైపు రావొచ్చని.. పోలీస్ అధికారి బాబూసింగ్ నుంచి ఫోన్ వచ్చింది. దీంతో మేం రహదారిపై వేచి ఉన్నాం. అటు నుంచి 2611 నెంబరు బైక్‌పై అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని చూసి పోలీసులకు సమాచారం అందించాం. మేం వారిని అనుసరించాం. అది వారికి తెలిసి.. కత్తులతో మమ్మల్ని బెదిరించారు. అల్లాహూ అక్బర్ అని నినాదాలు చేస్తూ.. వెంబడించొద్దని అన్నారు. కానీ మేం భయపడలేదు. పోలీసులకు నిరంతరం టచ్‌లో ఉన్నాం. ఆ తర్వాత పోలీసులు దిగ్బంధించిన రోడ్డువైపు కాకుండా మరో క్రాస్‌రోడ్ వైపు వెళ్లారు. అక్కడ మాకు ఓ పోలీస్ జీప్ కనిపించగా.. వారికి సైగ చేశాం. అలా ఇద్దరు నిందితులను పట్టుకున్నారు.''
- శక్తి సింగ్, ప్రహ్లాద్ సింగ్
నిందితులను పోలీసులకు అప్పగించినందుకు ఇప్పుడూ భయపడుతున్నారా అని ప్రశ్నించగా.. 'మేం కర్ణిసేనకు చెందినవాళ్లం. మాకు భయమే లేదు.' అని బదులిచ్చారు. అయితే.. ప్రాణాలకు తెగించి పోలీసులకు సాయం చేసిన వీరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని రాజ్‌పుత్ కర్ణిసేన జాతీయ అధ్యక్షుడు మహిపాల్‌సింగ్ మక్రాన కోరారు. వారి విద్యార్హతల ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సీఎం హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
ఐదో నిందితుడి అరెస్టు..
దర్జీ హత్య కేసులో ఐదో నిందితుడు మోసిన్‌ను సోమవారం రాత్రి జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. అతడిని జైపుర్ న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టారు. జులై 12 వరకు రిమాండ్‌కు తరలించాలని కోర్టు ఆదేశించింది.
ఉదయ్‌పుర్‌కు చెందిన కన్హయ్యలాల్‌ను జూన్ 28న పట్టపగలే ఇద్దరు వ్యక్తులు అతడి షాప్‌లోనే అతి కిరాతకంగా నరికి చంపారు. ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడమేగాక.. ప్రధానిని కూడా చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిని రాజకీయ నాయకులు, ప్రముఖులు ఖండించారు.
ఇవీ చూడండి: 'టైలర్' హత్యపై నిరసనల జ్వాల.. పోలీసుపై ఖడ్గంతో దాడి!