Two Died after Jumping into a Well in Khammam : వారిద్దరిది అన్యోన్య దాంపత్యం. ఉన్నంతలో బాగానే బతుకుతున్నారు. కష్టసుఖాలు పంచుకుంటూ.. ఒకరికొకరు తోడుంటూ సంసార సాగరాన్ని ఈదుతున్నారు. అంతా సాఫీగా సాగుతుండగా.. ఓ చిన్న కలత వారి కాపురాన్ని కకావికలం చేసింది. దంపతుల మధ్య జరిగిన గొడవ.. చివరకు భర్త ప్రాణాలు పోయేలా చేసింది. 'ఆలి'ని కాపాడుకునే ప్రయత్నంలో 'ఆయన' అసువులు బాసాడు. ఈ హృదయ విదారక ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేలకొండపల్లి మండలం అప్పల నరసింహాపురంలో కర్లపూడి నాగరాజు-రమణ దంపతులు జీవనం సాగిస్తున్నారు. ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన రమణ.. 'బావిలో దూకి చనిపోతా' అంటూ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. సమీపంలోనే వ్యవసాయ బావి ఉండటంతో క్షణికావేశంలో భార్య అందులో దూకిందేమోనని నాగరాజు ఆందోళన చెందాడు. వెంటనే పరుగెత్తుకెళ్లి ఆమెను కాపాడుకునేందుకు బావిలో దూకాడు. అయితే.. అతనికి ఈత రాదు.
నా మాటలే.. నీ ప్రాణం తీశాయి..: ఈ విషయం తెలుసుకున్న స్నేహితుడు యండ్రాతి జోజి బావిలోకి దూకి నాగరాజును కాపాడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరూ నీటిలో మునిగి గల్లంతయ్యారు. ఇంతలోనే అక్కడికి చేరుకున్న గ్రామస్థులు.. ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. రమణ శవం కనిపించకపోవడంతో చుట్టు పక్కల వెతకగా.. ఆమె సమీపంలోని ఓ పొలంలో కూర్చుని రోదిస్తున్నట్లుగా గుర్తించి విషయం చెప్పారు. తనను కాపాడబోయి.. భర్త ప్రాణాలు కోల్పోయారని తెలిసి ఆమె ఒక్కసారిగా హతాశురాలైంది. నాగరాజు మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించింది. తాను క్షణికావేశంలో అన్న మాటలు.. చివరకు తన ఇంటాయన ప్రాణాలను తీశాయంటూ రమణ రోదించిన తీరు అక్కడి వారిని తీవ్రంగా కలచివేసింది.
బావిలో పడి బాలిక.. కాపాడబోయి యువకుడు..: మరో ఘటనలో ప్రమాదవశాత్తు బావిలో పడి ఇద్దరు మృతి చెందారు. నల్గొండ జిల్లా దేవరకొండలోని పీర్లబావిలో పడి జ్యోతి, నాగరాజు అనే ఇద్దరు చనిపోయారు. ఈత కోసం ఇంటి పక్కనే ఉన్న బావి వద్దకు వెళ్లిన జ్యోతి అనే బాలిక.. ప్రమాదవశాత్తు అందులో పడిపోయింది. గమనించిన నాగరాజు అనే యువకుడు బాలికను కాపాడేందుకు బావిలోకి దూకాడు. ఈ క్రమంలో ఇద్దరూ నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు వారిని రక్షించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. చివరకు ఇద్దరి మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఒకేసారి కాలనీకి చెందిన ఇద్దరు చనిపోవడంతో స్థానికంగా విషాదఛాయలు నెలకొన్నాయి.
ఇవీ చూడండి..
నారాయణపేట జిల్లాలో విషాదం.. చెరువులో దిగి ముగ్గురు చిన్నారులు, తల్లి మృతి
'మరణంలోనూ.. నేనున్నానని.. నీతో వస్తానని'.. భద్రాద్రి దంపతుల హార్ట్ టచింగ్ స్టోరీ