జమ్ము కశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు పోలీసులు తెలిపారు. మరొకరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. పూంచ్ జిల్లాలోని దుర్గన్ పొషానా ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగినట్లు వెల్లడించారు.
ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో అక్కడికి చేరుకున్న భద్రతా దళాలు.. ముష్కరులను లొంగిపోవాలని సూచించాయి. అయితే ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారని పోలీసులు పేర్కొన్నారు. వీరిలో ఇద్దరు పాకిస్థాన్ జాతీయులు కాగా మరొకరు స్థానికుడని చెప్పారు.
జవాను మృతి..
మరోవైపు, షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదుల కోసం తనిఖీ నిర్వహిస్తున్న క్రమంలో ఓ జవాను ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. షోపియాన్ జిల్లా జైనపొరాలో ఏటవాలుగా ఉన్న ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుండగా. జవాను అబ్దుల్ మాజేద్‌దార్ ప్రమాదవశాత్తు జారి పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ జవానుకు తోటి సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మాజేద్‌దార్ స్వస్ధలం జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్.