UP Assembly Elections: ఉత్తర్ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇద్దరు ఎమ్మెల్యేలు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లో చేరారు. వీరిలో ఒకరు బీఎస్‌పీ బహిష్కృత నేత, చిల్లుపుర్ ఎమ్మెల్యే వినయ్ శంకర్ తివారీ కాగా.. మరొకరు ఖలీలాబాద్ నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే దిగ్విజయ్ నారాయణ్(జై చౌబే). వీరితో పాటు.. యూపీ శాసనమండలి మాజీ ఛైర్మన్ గణేష్ శంకర్ పాండే కూడా ఎస్పీలో చేరారు.
SP Akhilesh Yadav: ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై అఖిలేశ్ యాదవ్ విమర్శలు గుప్పించారు.
"భాజపా పాలనలో గడిచిన నాలుగేళ్లుగా వివక్షతతోనే పనులు జరుగుతున్నాయి. బ్రిటిష్ వారి 'విభజించి పాలించు' విధానం మాదిరే ప్రజలను భయాందోళనకు గురిచేసి పాలించాలని భాజపా భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో భాజపాకు ప్రజలే గుణపాఠం చెబుతారు."
-అఖిలేశ్ యాదవ్, ఎస్పీ అధినేత
Akhilesh Yadav News: అక్టోబరు 3న లఖింపుర్ ఖేరిలో జరిగిన హింసలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను ఎవరూ మర్చిపోలేరని అఖిలేశ్ అన్నారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే.. పేద ప్రజలకు ఉచితంగా ఆహారం అందించేందుకు క్యాంటీన్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
మరోవైపు.. భాజపా ప్రభుత్వం ప్రజాస్వామ్యం కోసం ఏర్పడలేదని ఈ సందర్భంగా తివారీ విమర్శించారు. ప్రజల్లో విద్వేష బీజాలు నాటిందని ఆరోపించారు. '2017లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా.. ప్రస్తుతం వారి సంఖ్య మూడుకు(3) పడిపోయింది. ఇలా ఎందుకు జరిగిందో ఆ పార్టీ ఆలోచించాలని' విమర్శించారు.
అయితే.. తివారీ వ్యాఖ్యలను బీఎస్పీ తిప్పికొట్టింది. కుటుంబ సభ్యులకు తివారీ టిక్కెట్లు అడిగారని.. కానీ తమ పార్టీ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించదని పేర్కొంది.
క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడటమే కాకుండా.. సీనియర్లతో దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ తివారీతోపాటు.. ఆయన సోదరుడు, మాజీ ఎంపీ కుశాల్ తివారీ, బంధువు పాండేను పార్టీ నుంచి బహిష్కరించింది బీఎస్పీ.
ఇవీ చదవండి: