ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. ఏఐసీసీలోని ఇద్దరు సీనియర్ నేతలు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మొదటి నుంచి పార్టీ నిర్ణయమే పరమావధిగా భావించి, ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న సీనియర్లకు కాంగ్రెస్‌లో తగిన గౌరవం దక్కడం లేదని ఆరోపించారు.
శైలేంద్ర సింగ్, రాజేశ్ సింగ్ అనే ఇద్దరు.. వారి రాజీనామా లేఖను ఉత్తర్‌ప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు అజయ్ కుమార్‌కు పంపారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఇప్పటికే తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే యూపీసీసీ అధ్యక్షునిపై ఆరోపణలు గుప్పించారు. పార్టీలోని సీనియర్ నాయకులకు రాష్ట్ర కమిటీ సరైన గౌరవం ఇవ్వడం లేదని అన్నారు. ఈ కారణంగానే విధేయులైన నేతలు పార్టీని వీడుతున్నట్లు తెలిపారు.
పార్టీలో నెలకొన్న పరిస్థితుల గురించి తాను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి ఇప్పటికే చాలాసార్లు తెలియజేశానని... కానీ ఆమె నుంచి ఎటువంటి స్పందన రాలేదని శైలేంద్ర సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌కి రాజీనామా చేయడం తప్ప తనకు వేరే మార్గం లేదని అన్నారు.
క్రియాశీలక రాజకీయాల్లో సుదీర్గ అనుభవం ఉన్న తమ లాంటి వారిని పక్కన పెడితే వచ్చే ఎన్నికల్లో పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
ఇదీ చూడండి: నిద్రిస్తున్న బాలికపై యాసిడ్ దాడి- ప్రేమే కారణమా?