నూతన ఐటీ చట్టాలపై కేంద్రానికి, సామాజిక మాధ్యమం ట్విట్టర్‌కు మధ్య విభేదాలు కొనసాగుతున్న తరుణంలో.. సోమవారం ట్విట్టర్ మరో కవ్వింపు చర్యకు పాల్పడింది. భారత్ మ్యాప్‌ను మరోసారి వక్రీకరించి చూపించింది ఆ సంస్థ. భారత్‌లో అంతర్భాగమైన జమ్మకశ్మీర్, లద్దాఖ్‌ను ప్రత్యేక దేశంగా తన వెబ్సైట్లో చూపించటం.. వివాదాస్పదంగా మారింది.
అసలింతకీ.. అమెరికాలో అధికారిక కార్యాలయం ఉన్న ఈ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌కు.. భారత ప్రభుత్వానికి మధ్య పేచీ ఎక్కడ మొదలైంది? ట్విట్టర్‌పై కేంద్రం తీసుకున్న చర్యలేంటి?
మొదటి నుంచి ససేమిరానే..
సామాజిక మాధ్యమాలపై నియంత్రణ పేరుతో.. మే 26 నుంచి కేంద్రం ప్రభుత్వం నూతన ఐటీ నిబంధనలను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం.. నోడల్, గ్రీవెన్స్, చీఫ్ కంప్లయన్స్ అధికారిని 50 లక్షల ఫాలోవర్స్ దాటిన అన్ని సామాజిక మాధ్యమాలు నియమించాలి. అయితే.. మిగతా సామాజిక మాధ్యమాలన్నీ ఈ నిబంధనలు పాటించేందుకు ముందుకురాగా.. ట్విట్టర్ మాత్రం మొదటి నుంచి ససేమిరా అంటూనే ఉంది.
ఈ విషయంలో ట్విట్టర్‌కు కేంద్రం ఎన్నోసార్లు నోటీసులు పంపింది. అయినా.. కేంద్రం మాటలను ఆ సంస్థ వినిపించుకోనేలేదు. ఆఖరి హెచ్చరికగా జూన్ 5న మరోసారి నోటీసులు పంపుతూ.. నూతన డిజిటల్ నిబంధనలు పాటించకుంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది కేంద్రం. ఐటీ, ఇతర చట్టాల ప్రకారం సంస్థపై చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది.
హెచ్చరికల ఫలితంగా..
కేంద్రం పంపిన తుది హెచ్చరికల ఫలితంగా ట్విట్టర్ దిగొచ్చింది. ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనలను పాటించేందుకు సిద్ధమేనని.. అయితే, వాటి అమలుకు మరికొంత సమయం కావాలని కోరింది. ఈ క్రమంలోనే.. ట్విట్టర్‌కు ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ విభాగ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమన్లు జారీ చేసింది. జూన్ 18న సాయంత్రం 4లోపు తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.
ఈ పరిస్థితుల్లో స్పందించిన ట్విట్టర్.. ట్వీట్ల పరంగా తమకు వచ్చే ఫిర్యాదుల పరిశీలనకు సంధానకర్తగా ఓ అధికారిని నియమించినట్లు జూన్ 16న వెల్లడించింది. అయితే.. అదే రోజు ట్విట్టర్‌కు కేంద్రం షాక్ ఇచ్చింది. నూతన నిబంధనలు పాటించని కారణంగా ట్విట్టర్ మధ్యవర్తిత్వ వేదిక హోదాను కోల్పోయినట్లు ప్రకటించింది.
ఏమిటీ మధ్యవర్తిత్వ హోదా?
ఈ హోదా వల్ల.. సోషల్ మీడియాలో ఎవరైనా అభ్యంతరకర సమాచారం పెట్టినా.. దాన్ని తమ వేదికగా ప్రచారం చేసినా.. ఆ సంస్థకు ఏమీ కాదు. కేవలం పోస్టు పెట్టిన వారిపై మాత్రమే చర్యలు తీసుకునేవారు. అంటే యూజర్లకు మధ్యవర్తులుగానే ఈ ప్లాట్‌ఫామ్‌లను చూస్తారు. కానీ మధ్యవర్తి హోదా రద్దయితే ఆయా సోషల్ మీడియా సంస్థలు కూడా క్రిమినల్ చర్యలు ఎదుర్కోవటానికి ఆస్కారం ఉంటుంది.
ట్విట్టర్‌పై యూపీ కేసు...
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ ముస్లిం వృద్ధుడిపై దాడి ఘటనకు సంబంధించి ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరికి యూపీలోని గాజియాబాద్ పోలీసులు నోటీసులు జారీచేశారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొంతమంది ట్విట్టర్‌ను ఉపయోగించుకున్నారని తెలిపారు. యూపీ కేసుపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
అయితే.. ఈ కేసులో యూపీ పోలీసుల నోటీసులపై కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు మనీశ్ మహేశ్వరి. దీనిపై విచారించిన న్యాయస్థానం.. యూపీ పోలీసులు చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
దేశచట్టాలే అత్యుత్తమైనవి...
పార్లమెంటరీ స్థాయి సంఘం పిలుపు మేరకు జూన్ 18న ట్విట్టర్ సంస్థ ప్రతినిధులు.. హాజరయ్యారు. కొత్త నిబంధనలను ట్విట్టర్ ఇంకా పాటించకపోడాన్ని కాంగ్రెస్ నేత శశి థరూర్ నేతృత్వంలోని స్థాయీ సంఘం సభ్యులు తీవ్రంగా తప్పుబట్టింది. దేశ చట్టాలే అత్యత్తమైనవి తప్ప, సంస్థ విధివిధానాలు కాదని ట్విట్టర్‌కు పార్లమెంటు సభ్యులు స్పష్టం చేశారు.
ఐటీ మంత్రి ఖాతానే బ్లాక్...
ఈ విభేదాలు ఇంకా కొనసాగుతున్న తరుణంలోనే.. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు శుక్రవారం ట్విట్టర్ షాక్ ఇచ్చింది. అమెరికన్ మిలీనియం కాపీరైట్ చట్టాన్ని(డీఎంసీఏ) ఉల్లంఘించారని పేర్కొంటూ ఆయన ఖాతాను ట్విట్టర్ నిలిపివేయడం సంచలనం రేపింది.
సొంత అజెండా కోసమే..
ముందస్తు నోటీసు ఇవ్వకుండా.. ఖాతాను నిలిపివేయటంపై రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. "భావ ప్రకటన స్వేచ్ఛకు దూతగా చెప్పుకుంటూ తన సొంత అజెండాను అమలు చేసేందుకే ఆసక్తి చూపుతున్నట్లు ట్విట్టర్ చర్యతో స్పష్టమైంది. వారి గీతను దాటింతే ఖాతాను ఏకపక్షంగా తొలగిస్తామని హెచ్చరికలు చేస్తున్నారు." అంటూ విరుచుకుపడ్డారు. ఐటీ నిబంధనలపై కేంద్రం రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ఏ సామాజిక మధ్యమమైనా చట్టాన్ని అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
ఐటీ మంత్రి ఖాతాను నిలిపివేసినట్లుగానే.. ఐటీ పార్లమెంటరీ స్థాయీ సంఘం ఛైర్మన్ శశిథరూర్ ఖాతాను కూడా ట్విట్టర్ తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే.. దీనిపై వివరణ ఇవ్వాలని ట్విట్టర్‌ను తాము కోరతామని ఆయన చెప్పారు.
గ్రీవెన్స్ అధికారి గుడ్‌బై..
ఇదే క్రమంలో.. ట్విట్టర్ ఇండియా తాత్కాలిక రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారి తన పదవికి గుడ్‌బై చెప్పారు. నూతన ఐటీ నిబంధనలకు అనుగుణంగా ఇటీవలే నియమితులైన ధర్మేంద్ర చతుర్ ఆ పదవి నుంచి వైదొలిగారు. అందుకు గల కారణాలు తెలియరాలేదు. దీనిపై స్పందించేందుకు ట్విట్టర్ సైతం నిరాకరించింది. ట్విట్టర్‌కు, భారత ప్రభుత్వానికి మధ్య విభేదాలు నెలకొన్న తరుణంలో ఆయన రాజీనామా చర్చనీయాంశంగా మారింది.
ఏకంగా భారత పటాన్నే..
అంతటితో ఆగకుండా.. మరో వివాదాస్పద చర్యకు ట్విట్టర్ సోమవారం పాల్పడింది. భారతదేశ చిత్ర పటాన్ని మరోసారి వక్రీకరించింది. జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌ను తన వెబ్సైట్లో ప్రత్యేక దేశంగా చూపించింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. ట్విట్టర్‌కు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
భారత్ మ్యాప్‌ను తప్పుగా చూపటం ట్విట్టర్‌కు ఇదే మొదటిసారి కాదు. గతేడాది కూడా లేహ్ ప్రాంతాన్ని చైనా మ్యాప్‌లో చూపించి విమర్శలు మూటగట్టుకుంది. ఆ సమయంలో ట్విట్టర్‌కు ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఈ తరుణంలో మరోసారి అలాంటి చర్యకే పాల్పడిన ట్విట్టర్‌పై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
ఇదీ చూడండి: 'ఐటీ నిబంధనలపై స్టే ఇవ్వలేం'