కరోనాపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వందకు పైగా పోస్టులను ప్రభుత్వ ఆదేశాల మేరకు ట్విట్టర్, ఫేస్బుక్ సహా పలు సామాజిక మాధ్యమాలు తొలగించాయి. వైద్య రంగంలో నెలకొన్న సంక్షోభంపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న పోస్టులను తొలగించాలని కేంద్రం కోరినందున.. ఈ చర్యలు చేపట్టాయి.
ఆక్సిజన్, ఔషధాలపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం వ్యాప్తి అధికమైన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కరోనాపై చేస్తున్న పోరాటంలో అడ్డంకిగా మారిన తప్పుడు పోస్టులను, యూఆర్ఎల్లను తొలగించాలని సామాజిక మాధ్యమాలను ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. సామాజిక మాధ్యమాల వేదికగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఖాతాలపై చర్యలకు ఉపక్రమించాలని సూచించింది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు నెల వ్యవధిలో సామాజిక దిగ్గజం ట్విట్టర్ 50కి పైగా పోస్టులను తొలగించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఫిల్మ్ మేకర్ల ట్వీట్లూ ఉన్నాయని లూమెన్ డేటాబేస్ అనే స్వతంత్ర సంస్థ పేర్కొంది. కరోనా నియంత్రణపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేసిన ట్వీట్లను సైతం ట్విట్టర్ తొలగించింది. దీనిపై సంబంధిత ఖాతాదారులకు సమాచారం ఇచ్చినట్లు ట్విట్టర్ తెలిపింది. అయితే, ఫేస్బుక్ మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇదీ చదవండి- 'గగన్యాన్ కోసం డేటా రిలే ఉపగ్రహ ప్రయోగం'