Tribal Village Library in Gujarat : అదో మారుమూల పల్లెటూరు. గిరిజన ప్రాంతం కావడం వల్ల అక్కడ మౌలిక సదుపాయాలు సైతం అంతంతమాత్రమే. కానీ అద్భుతమైన గ్రంథాలయాన్ని మాత్రం ఏర్పాటు చేసుకున్నారు ఆ గ్రామస్థులు. ఫలితంగా ఒక్క ఏడాదిలోనే గ్రామానికి చెందిన 19 మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి ఔరా అనిపించారు!
గుజరాత్ దాహోద్ జిల్లాలోని పావ్డి గ్రామంలో ఉందీ లైబ్రరీ. విద్యార్థులకు చదువుకోవడంలో సహకారం అందించాలనే లక్ష్యంతో గ్రామస్థులంతా కలిసి 2017లో ఈ సామూహిక గ్రంథాలయాన్ని స్థాపించారు. ఆ తర్వాత 2018లో ఓ ఇంటిని ప్రత్యేకంగా లైబ్రరీ కోసం కేటాయించారు. పోటీ పరీక్షలతో పాటు వివిధ రకాల పుస్తకాలను సేకరించి గ్రంథాలయంలో పెట్టారు. ఫలితంగా ఒక్క ఏడాదిలోనే సుమారు 19 మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు.
"2022-23 మధ్యలో సుమారు 19 మంది విద్యార్థులు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సంపాదించారు. వారందరికీ సామూహిక గ్రంథాలయంలో సన్మానం చేసి గౌరవించాం. వీరిని చూసి గ్రామంలోని మిగతా యువత కూడా ప్రేరణ పొందాలనే ఉద్దేశంతోనే ఇలా చేశాం."
--సంజయ్ భాబోర్, లైబ్రరీ వ్యవస్థాపకులు
ఈ గ్రంథాలయం అనేక మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపింది. ఈ లైబ్రరీ.. తమ జీవితంలో కీలక పాత్ర పోషించిందని ఉద్యోగాలు సాధించినవారు చెబుతున్నారు.
"ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఫలితంగా చదువుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది. చాలా మంది విద్యార్థులు ఇక్కడే చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. అందులో నేను ఒకరిని."
-దీపిక, విద్యార్థి
"ఈ గ్రంథాలయాన్ని ఉపయోగించుకుని సుమారు 19 మంది ఉద్యోగాలు సాధించారు. ప్రతి గ్రామంలోనూ ఇలాంటి గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలి. దాని వల్ల పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి ప్రయత్నిస్తారు."
-జిగ్నేశ్ హథీలా, విద్యార్థి
"ఈ లైబ్రరీలో అనేక పుస్తకాలు ఉన్నాయి. విద్యార్థులకు సలహాలు ఇవ్వడానికి ఉద్యోగాలు సాధించినవారు ఇక్కడ ఉంటారు. గ్రామంలోని విద్యార్థులందరూ ఈ గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నా. బాగా చదివి ఉజ్వలమైన భవిష్యత్తును పొందాలని ఆశిస్తున్నా."
-నేహాల్, స్థానికురాలు
అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నప్పటికీ ఈ గ్రామం.. ఒకే ఏడాదిలోనే 19 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా అనేక గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది గిరిజన గ్రామం.
చిన్న ఊరిలో 100 CCTV కెమెరాలు- ప్రెసిడెంట్ చొరవతో ఫుల్ సెక్యూరిటీ!