మహారాష్ట్ర అకోలా జిల్లా పరాస్ గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. వర్షాల ధాటికి ఓ భారీ వృక్షం దేవాలయంలోని రేకుల షెడ్డుపై కూలింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 23 మందికిపైగా గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
గ్రామంలో ఉన్న బాబూజీ మహారాజ్ సంస్థాన్ ఆలయంలో ఆదివారం సాయంత్రం 7.30 గంటలకు పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంతో భక్తులు భగవంతుడి దర్శనం కోసం దేవాలయానికి వచ్చారు. అదే సమయంలో భారీగా వర్షం కురుస్తోంది. దీంతో భక్తులు, అటుగా వెళుతున్న ద్విచక్ర వాహనదారులు.. పక్కనే ఉన్న ఓ రేకుల షెడ్లోకి వెళ్లి తలదాచుకున్నారు.
భీకర గాలులతో వర్షం కురుస్తున్న కారణంగా.. 100 సంవత్సరాల వయస్సున్న ఓ పెద్ద చెట్టు కూలి షెడ్‌పై పడింది. దీంతో అందులో ఉన్న వారు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఏడుగురు మృతి చెందారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వీరంతా జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రాంతంలో నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. షెడ్లో మొత్తం 40 మంది ఉన్నారని పోలీసులు తెలిపారు.
ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాధ్ షిండే స్పందించారు. ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ.. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. వారికి రూ. నాలుగు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. 60 శాతం పైగా గాయపడ్డవారికి రూ. 2,50,000 ఇస్తామన్నారు. 60 శాతం కన్నా తక్కువ గాయపడ్డవారికి రూ. 74,000 రూపాయలు ఇస్తామని వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కూడా ట్విట్టర్ ద్వారా విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
సౌండ్ చేయొద్దన్నందుకు గర్భిణిని గన్‌తో కాల్చి చంపాడు..
డీజే సౌండ్ తగ్గించాలని చెప్పినందుకు గర్భిణిని గన్‌తో కాల్చాడు ఓ వ్యక్తి. తీవ్రంగా గాయపడ్డ ఆ మహిళ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. దేశ రాజధాని దిల్లీలో.. ఏప్రిల్ 3న ఈ దారుణం జరిగింది. శివారు ప్రాంతమైన సిరాస్‌పూర్‌లో ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడిని హరీశ్‌గా, మృతురాలిని రంజు(30)గా పోలీసులు గుర్తించారు. రంజు ఉంటున్న ఇంటికి సమీపంలో హరీశ్ కుటుంబం కూడా నివసిస్తోంది. ఏప్రిల్ 3న కొడుకు బారసాల సందర్భంగా హరీశ్ పెద్దగా డీజే మోగించాడు. దీంతో గర్భిణి అయిన రంజు.. తనకు ఇబ్బందిగా ఉందని.. సౌండ్ కాస్తా తగ్గించాలని హరీశ్‌ను కోరింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన హరీశ్.. తన స్నేహితుడు అమిత్ చేతిలోని గన్ తీసుకొని ఆమె మెడపై కాల్చాడు. అనంతరం ఆమె ఒక్కసారిగా కుప్పకూలింది. అప్రమత్తమైన బంధువులు, స్థానికులు రంజును హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతు ఆమె మృతి చెందింది. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.