కరోనా సంక్షోభంతో చిన్నాభిన్నమైన పర్యటక రంగానికి.. టీకా వార్తలు ప్రాణం పోశాయి. దాదాపు ఏడాది పాటు డీలాపడ్డ ఈ రంగాన్ని పునరుద్ధరించేందుకు ఇదే మంచి సమయని భావిస్తున్నారు ట్రావెల్ ఏజెంట్లు. ఇందుకోసం ప్రణాళికలు రచిస్తున్నారు. కరోనా భయాలు పూర్తిగా తొలిగిపోని తరుణంలో.. ప్రజలను తమ 'ప్యాకేజీ'లతో ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ముంబయికి చెందిన ఓ ట్రావెల్ ఏజెన్సీ ఈ 'వ్యాక్సిన్ టూరిజం'కు నాంది పలికింది. టీకాను ఈ నెలలోనే ప్రజలకు పంపిణీ చేసేందుకు అమెరికా సన్నద్ధమవుతున్న తరుణంలో.. అగ్రరాజ్యంపై ఈ సంస్థ గురిపెట్టింది. ఇన్నేళ్లలో ఎన్నడూ లభించిన ధరలతో ఆకర్షణీయమైన ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో 'వ్యాక్సినేషన్'ను కూడా జోడించింది. అంటే.. ఈ ప్యాకేజీ పొందినవారికి.. తక్కువ ఖర్చుతోనే అమెరికాను చుట్టేయడం సహా టీకా కూడా లభిస్తుందన్న మాట!
అయితే ఆశాజనకంగా ఉన్న టీకాల అత్యవసర వినియోగానికి అమెరికా ఇంకా అనుమతులివ్వలేదు. ఈ నెల 10,11వ తేదీల్లో దీనిపై స్పష్టతవచ్చే అవకాశముంది.
బ్రిటన్‌వైపే చూపు...
అదే సమయంలో.. ఫైజర్ టీకాకు అనుమతులిస్తున్నట్టు బుధవారం అనూహ్య ప్రకటన చేసింది బ్రిటన్. వచ్చే వారం నుంచి టీకా పంపిణీకి శరవేగంగా చర్యలు చేపడుతోంది. ఇందుకు సంబంధించి పక్కా ప్రణాళిక రచించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా బ్రిటన్ ఇప్పుడు ఓ హాట్‌టాపిక్‌గా మారింది. పర్యటన కన్నా.. టీకా వేయించుకునేందుకైనా బ్రిటన్‌కు వెళ్లాలని భావిస్తున్నారు ప్రజలు.
ఇదీ చూడండి:- టీకా సరే.. 'ప్రణాళిక' అమలు అంత సులభమా?
ఈ పరిణామాలతో అందరి చూపు ఇప్పుడు బ్రిటన్‌పై పడింది. ముఖ్యంగా భారత్‌లో ఈ 'వ్యాక్సిన్ టూరిజం'కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఫలితంగా.. ఈ ట్రావెల్ ఏజెన్సీలకు కాల్స్ పెరిగిపోయాయి. కరోనా వ్యాక్సిన్ పొందేందుకు.. తాము బ్రిటన్‌కు ఎప్పుడు, ఎలా వెళ్లగలమని వాకబు చేస్తున్నారు భారతీయులు. బ్రిటన్ వీసాలున్న వారే ఎక్కువగా ఫోన్లు చేస్తున్నట్టు ఏజెంట్లు వెల్లడించారు.
ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న ఓ సంస్థ.. 'మూడు రోజుల' బ్రిటన్ ప్యాకేజీపై కసరత్తు చేస్తోంది. అయితే ఈ ప్యాకేజీని అమలు చేయడానికి కొంత సమయం పడుతుందని ఆ సంస్థ భావిస్తోంది. అదే విషయాన్ని ప్రజలకు చెబుతోంది. భారతీయులు.. బ్రిటన్‌కు వెళ్లి టీకా వేయించుకోవడంపై ఇప్పుడే ఏం చెప్పలేమని స్పష్టం చేస్తోంది.
బ్రిటన్‌లో ఈ నెల 15 నుంచి అంతర్జాతీయ ప్రయాణికుల నిబంధనలు మారనున్నాయి. విదేశాల నుంచి వచ్చినవారు ఐదు రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండి కరోనా పరీక్షలు చేయించుకోవాలి. అందులో నెగిటివ్‌గా తేలితే ఆరో రోజు బయటకు వెళ్లొచ్చు.
అయితే ఇదే విషయంపై భారతీయులు ఏజెంట్లను విచిత్రమైన ప్రశ్నలు వేస్తున్నారు. 'క్వారంటైన్ లేకుండా.. బ్రిటన్‌కు వెళ్లి టీకా వేయించుకునేందుకు ఏదైనా చిన్న ట్రిప్ సాధ్యపడుతుందా?' అని ప్రశ్నిస్తున్నారు.
'తస్మాత్ జాగ్రత్త..'
ఓవైపు 'వ్యాక్సిన్ టూరిజం'కు డిమాండ్ పెరుగుతుంటే.. మరోవైపు భారీ స్థాయిలో నేరాలు పెరిగే అవకాశముందని హెచ్చరిస్తోంది ఇంటర్‌పోల్. నకిలీ కొవిడ్-19 వ్యాక్సిన్లను ప్రచారం చేసి అమ్మే ప్రయత్నాలు జరుగుతాయని తేల్చిచెబుతోంది. ఈ విషయంపై నిత్యం అప్రమత్తంగా ఉండాలని 194 దేశాలకు ఆరెంజ్ నోటీసులు అందించింది.
ఇదీ చూడండి:- టీకాపై భారత ప్రభుత్వంతో చర్చిస్తాం: ఫైజర్