Tomatoes Subsidy Central Government : సెంచరీతో మొదలైన టమాటా ధరల పరుగు.. ఇంకా ఆగడం లేదు. ఎప్పుడో నెల కిందట.. వారం, పదిరోజుల్లో ధరలు నియంత్రణలోకి వస్తాయని అంతా అనుకున్నారు. సరిగ్గా అదే సమయంలో భారీ వర్షాలు పెద్ద దెబ్బే వేశాయి. దీంతో టమాటాతో పాటు ఇతర కూరగాయల రవాణా నిలిచిపోయి.. ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ సమయంలో ప్రత్యామ్నాయాల వైపు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
టమాటా ధర నియంత్రణలో భాగంగా కేంద్రం కొత్త ఆలోచన చేసింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి టమాటాలను సేకరించి.. అధిక ధరలు ఉన్న ప్రాంతాల్లో తక్కువ ధరకే విక్రయించాలని నిర్ణయించింది. దిల్లీ-ఎన్‌సీఆర్, ఉత్తర్ప్రదేశ్, బిహార్, బంగాల్లోని వేర్వేరు నగరాల్లో ప్రజలకు జులై 14 నుంచే రాయితీ ధరకు టమాటాలు అందేలా చూడనుంది.
దిల్లీతోపాటు పట్నా, వారణాసి, కాన్పుర్, కోల్‌కతా నగరాల్లో టమాటాలను తక్కువ ధరకు విక్రయిస్తామని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. ప్రధాన వినియోగ కేంద్రాల్లో పంపిణీ చేసేందుకు గాను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి టమాటాలను సేకరించాలని కేంద్ర సహకార సహకార సంస్థలైన నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ (NAFED), నేషనల్ కోఆపరేటివ్ కన్జుమర్స్ ఫెడరేషన్ (NCCF)ను ఆదేశించినట్లు చెప్పారు.
"టమాటాలను దిల్లీ సహా పలు నగరాల్లో ప్రస్తుత ధర కంటే 30 శాతం తక్కువకు విక్రయిస్తాం. వినియోగదారులకు ఉపశమనం కలిగించాలనే మంచి ఆలోచన ఇది. ఉల్లిపాయల ధరలు భారీ పెరిగినప్పుడు కూడా ఇలానే చేశాం. కానీ టమాటా వేగంగా పాడైపోయే వస్తువు కాబట్టి ఇది కాస్త సవాలుతో కూడిన పని"
-- రోహిత్ కుమార్ సింగ్, వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి
'త్వరలోనే టమాటా ధర తగ్గే అవకాశం'
"గుజరాత్, మధ్యప్రదేశ్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాలకు ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి టమాటాలు సరఫరా అవుతున్నాయి. ఏపీలోని మదనపల్లె నుంచి సరైన పరిమాణంలోనే వస్తున్నాయి. దిల్లీకి హిమాచల్‌తోపాటు కర్ణాటక నుంచి అధికంగా వస్తాయి. మహారాష్ట్రలోని నారాయణ్‌గావ్, ఔరంగాబాద్‌తోపాటు మధ్యప్రదేశ్ నుంచి త్వరలోనే అదనపు పంట రానుంది. దీంతో త్వరలోనే టమాటా ధర దిగివచ్చే అవకాశం ఉంది" అని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ అంచనా వేసింది.
Tomatoes Price Hike Reason : ఏటా డిసెంబర్- ఫిబ్రవరి మధ్య టమాటా సరఫరా ఎక్కువగా ఉంటుందని, జులై-ఆగస్టు, అక్టోబర్-నవంబర్ మాసాల్లో తక్కువగా ఉంటుందని కేంద్రం వినియోగదారుల వ్యవహారాల శాఖ తెలిపింది. వర్షాకాలంతోపాటు జులైలో సరఫరాలో అంతరాయం, రవాణా నష్టాలు పెరగడమే టమాటా ధరల పెరుగుదలకు కారణమని కేంద్రం వెల్లడించింది.
Tomatoes Price Today : బుధవారం నాడు.. కిలో టమాటా సగటు ధర రూ.111.71గా ఉంది. గరిష్ఠంగా పంజాబ్‌లో కిలో రూ.203 ఉండగా.. కర్ణాటకలోని బీదర్‌లో కనిష్ఠ ధర రూ.34గా ఉంది. మెట్రోల్లో కేజీ టమాట ధర దిల్లీలో రూ.150, ముంబయిలో రూ.137, కోల్‌కతాలో రూ.137, చెన్నైలో రూ.123 వద్ద ఉంది.