టోక్యో ఒలింపిక్స్‌లో భారత ప్రదర్శనపై రాజ్యసభలో ప్రశంసలు కురిపించారు ఛైర్మన్ వెంకయ్య నాయుడు. 121 ఏళ్ల విశ్వక్రీడల ప్రయాణంలో 2020 ఒలింపిక్స్ భారత్‌కు అత్యున్నతమైనదని కొనియాడారు. 'ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి పేలవమైన ప్రదర్శనతో ఎదురయ్యే నిరాశ, నిస్పృహ, అవిశ్వాస భావాలను తొలగిస్తూ.. మేము కూడా చేయగలం అని చెప్పేందుకు చాలా సమయం పట్టింద'న్నారు.
"1980 వరకు మన హాకీ పురుషుల జట్టుకు గోల్డెన్ రికార్డు ఉంది. కొంత మంది అథ్లెట్ల ద్వారా మంచి ప్రదర్శనలు చూశాం. కొన్నేళ్లుగా ఒలింపిక్స్‌లో పేలవమైన ప్రదర్శనతో మన దేశం ఆత్మగౌరవం, విశ్వాసం, నమ్మకం, ఆశను కోల్పోయే స్థాయికి చేరుకుంది. అలాంటి పరిస్థితుల్లో ఏ దేశమూ తలెత్తుకోలేదు. మెడల్స్ సాధించటం కంటే క్రీడల్లో పాలుపంచుకోవాలనే స్ఫూర్తిని ఈ ఒలింపిక్స్ నింపింది. అయితే.. పతకాల సంఖ్య ఏ దేశానికైనా క్రీడా నైపుణ్యాలకు తుది సాక్ష్యంగా నిలుస్తుంది. ఒలింపిక్ మెడల్స్ సాధించటం వల్ల అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు అంతర్జాతీయంగా ఆదరణ చూరగొంటాయి. ఒలింపిక్ పతకాల సంఖ్య పరంగా చూస్తే.. భారత్ చాలా కాలంగా నిరాశకు గురైంది. అత్యధిక పతకాలు గెలవటంలోనే కాదు, చాలా మంది అథ్లెట్లు మెడల్ గెలిచే రౌండ్ల వరకు వెళ్లటంలోనూ... టోక్యో ఒలింపిక్స్ భారత్‌కు అత్యుత్తమం."
-వెంకయ్య నాయుడు, రాజ్యసభ ఛైర్మన్
జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్డాను ప్రశంసించారు వెంకయ్య. అదే రోజున రెజ్లర్ బజరంగ్ పునియ కాంస్యం సాధించినట్లు గుర్తు చేసుకున్నారు. మహిళా అథ్లెట్లు సైతం పలు అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధిస్తున్నట్లు చెప్పారు. రాజ్యసభ సభ్యురాలు, బాక్సర్ మేరీ కోమ్ విజయాలను గుర్తు చేసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రైల్వే, ఆర్మీ, ఇతర రంగాలు, కోచ్‌లు, సహాయ సిబ్బంది, క్రీడల విభాగాలను ప్రశంసించారు.
లోక్‌సభలోనూ..
టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుల ప్రదర్శనపై ప్రశంసలు కురిపించారు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా. పతకాలు సాధించిన వారికి అభినందనలు తెలిపారు. జావెలిన్ త్రోలో పసిడి పతకం సాధించిన నీరవ్ చోప్డా పేరు చెప్పగానే బల్లలు చరుస్తూ.. అభినందనలు తెలిపారు సభలోని ఎంపీలు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ అత్యధిక మెడల్స్ సాధించటంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రదర్శన యువతలో ఉత్సాహాన్ని నింపుతుందన్నారు స్పీకర్.
ఇదీ చూడండి: Tokyo Olympics: ఆటలో ఓడినా.. స్ఫూర్తి రగిలించారు..!