కరుణానిధి, జయలలిత.. తమిళ రాజకీయాలు అనగానే ముందుగా గుర్తొచ్చే పేర్లు ఇవి. రాష్ట్ర రాజకీయాల్లో, రాష్ట్ర ప్రజల్లో వారిది చెరగని ముద్ర. అలాంటిది.. ఎన్నో దశాబ్దాల తర్వాత.. ఈ దిగ్గజ నేతలు లేకుండా తొలిసారి ఎన్నికలకు వెళుతున్నాయి డీఎంకే, అన్నాడీఎంకే. వారి పేర్లను అస్త్రాలుగా మలచుకుని ఎన్నికల వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇంతకీ.. కరుణానిధి, జయలలిత ఏ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు? ఇప్పుడు వారి స్థానాల్లో ఎవరు బరిలో దిగుతున్నారు?
కరుణానిధి..
పోటీ చేసిన ప్రతి ఎన్నికలో గెలుపొందిన ఘనత డీఎంకే మాజీ అధినేత సొంతం. 1957లో తొలిసారి అసెంబ్లీ సీటు గెలిచిన కరుణానిధి ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. 1984(ఆయన పోటీ చేయలేదు) మినహా.. 2016 వరకు ఎన్నికల్లో నిలిచి విజయాలను దక్కించుకున్నారు.
2011, 2016లో తిరువారూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కరుణానిధి.. రెండుసార్లూ గెలిచారు. అంతకుముందు చెన్నైలోని చెపాక్-తిరువల్లికేని నుంచి మూడుసార్లు విజయాన్ని అందుకున్నారు.
ఇదీ చూడండి:- తమిళనాట వాళ్లు లేకపోయినా వాడీవే'ఢీ'!
2018లో దిగ్గజ నేత మరణించారు. 2019లో జరిగిన ఉపఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి పాండీ కలైవానన్ తిరువారూర్ నుంచి గెలిచారు. 2021 ఎన్నికల్లోనూ ఆ సీటును కలైవానన్కే అప్పగించింది పార్టీ అధిష్ఠానం.
అదే సమయంలో.. కరుణానిధి ఘన చరిత్ర ఉన్న చెపాక్-తిరువల్లికేనిలో ఆయన మనవడు, డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను రంగంలోకి దింపింది పార్టీ.
జయలలిత...
ఆరుసార్లు సీఎంగా పనిచేసిన జయలలిత.. అన్నాడీఎంకేలోని ఓ వర్గం(జయలలిత వర్గం) మద్దతుతో 1989 ఎన్నికల్లో బరిలో దిగి తొలిసారి విజయాన్ని రుచిచూశారు. 2011 ఎన్నికల్లో తిరుచిరాపల్లి జిల్లాలోని శ్రీరంగం నుంచి పోటీ చేశారు. 2016లో ఆర్కే నగర్ నియోజకవర్గంలో గెలిచారు.
2016 డిసెంబర్లో జయలలిత మరణించారు. 2017లో ఆర్కే నగర్‌కు జరిగిన ఉపఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి టీటీవీ దినకరన్ పోటీ చేసి గెలిచారు. ఆయన అన్నాడీఎంకే బహిష్కృత నేత కావడం, అనంతరం 2018లో ఏఎమ్ఎమ్కే పార్టీని స్థాపించడం విశేషం.
తాజా ఎన్నికలకు శ్రీరంగం నుంచి కేపీ కృష్ణన్‌ను, ఆర్కే నగర్ నుంచి ఆర్ఎస్ రాజేశ్‌ను బరిలోకి దింపింది అన్నాడీఎంకే.
కరుణానిధి, జయలలిత స్థానాలను వీరు భర్తీ చేయలేకపోయినా.. వారి జ్ఞాపకాలతో ప్రజలు వీరికి ఓట్లు వేసి గెలిపిస్తారా? లేదా? అనేది మే 2న తెలుస్తుంది.
ఇదీ చూడండి:- ఓటర్లకు డబ్బులు పంచిన అన్నాడీఎంకే నేత